Begin typing your search above and press return to search.

తెలంగాణ నాయకుల ఫోన్లూ ట్యాప్‌ చేశారా!?

By:  Tupaki Desk   |   27 Jun 2015 5:30 PM GMT
తెలంగాణ నాయకుల ఫోన్లూ ట్యాప్‌ చేశారా!?
X
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుచరులు.. ఆ పార్టీ ముఖ్య నాయకులు, అధికారుల ఫోన్లు మాత్రమే కాదు.. తెలంగాణలోని కొంతమంది మంత్రులు, అధికారుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. దాంతో తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రం నాయకులతోపాటు సొంత పార్టీ నాయకులపైనా నిఘా వేసిందనే కథనాలు ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు, అధికారుల ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్‌ చేయించిందని టీడీపీ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలతోనే తెలంగాణ ప్రభుత్వం కాస్త ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. దీనికితోడు ఇప్పుడు కొత్త వాదన తెరపైకి వస్తోంది.

తెలంగాణ ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులతోపాటు కొంతమంది అధికారుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారనే కథనాలు ఇప్పుడు విస్తృతంగా వస్తున్నాయి. అయితే, ఈ ట్యాపింగ్‌ను ఎవరు చేయించారనే అంశం మాత్రం సస్పెన్స్‌గా ఉంది. ఏపీ ప్రభుత్వం వీటిని ట్యాప్‌ చేయించిందా? లేక, తమ పార్టీ మంత్రులు, నాయకులపై తెలంగాణ ప్రభుత్వమే ట్యాప్‌ చేయించిందా? ప్రత్యర్థి పార్టీలతోపాటు సొంత పార్టీ నాయకులపై కూడా టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం నిఘా వేసిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ మంత్రులపై ఏపీ ప్రభుత్వం నిఘా వేసి వారి ఫోన్లను ట్యాప్‌ చేయించి ఉంటే ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌పై ఇంత యాగీ చేసేది కాదని, ఈ నేపథ్యంలో సొంత పార్టీ నాయకులపై తెలంగాణ ప్రభుత్వమే నిఘా వేసిందా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.