Begin typing your search above and press return to search.

అదే జరిగితే తెలంగాణ మొత్తం 22 జిల్లాలు

By:  Tupaki Desk   |   10 Oct 2015 5:34 AM GMT
అదే జరిగితే తెలంగాణ మొత్తం 22 జిల్లాలు
X
తెలంగాణ స్వరూపం మారనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం దూసుకెళుతోంది. తెలంగాణ సాధన సమయంలో.. రాష్ట్రం కానీ ఏర్పాటు జరిగితే.. పలు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తామని అప్పట్లో ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్ ప్రకటించారు. దీనికి తగ్గట్లే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. జిల్లాల పెంపుపై ఆయన దృష్టి కేంద్రీకరించారు.

ఇదే సమయంలో.. తెలంగాణలోని పలు జిల్లాల్ని మరికొన్ని జిల్లాలుగా మార్చాలన్న డిమాండ్లు ఎక్కడికక్కడ పెరుగుతున్న పరిస్థితి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ సర్కారు కసరత్తు పూర్తి చేసింది. ఒక ముసాయిదాను సిద్ధం చేశారు.

కొత్త జిల్లాల కోసం భారీగా డిమాండ్లు వినిపిస్తున్నక్రమంలో.. కొత్త జిల్లాల ఏర్పాటు మరింత అసంతృప్తి సెగ రేపకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పక్కా ప్రణాళిక సిద్ధం చేయటంతో పాటు.. జిల్లా ఏర్పాటుకు సంబంధించి నిరసనలు.. ఆందోళనలు లాంటివి చోటు చేసుకోకుండా ఉండాలన్న భావనలో తెలంగాణ సర్కారు ఉంది.

తాజాగా రూపొంచిందిన సమాచారం ప్రకారం.. తెలంగాణలో కొత్తగా 12 జిల్లాల్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ముసాయిదానే వాస్తవ రూపం దాలిస్తే మాత్రం.. తెలంగాణ మొత్తం 22 జిల్లాలుగా అవతరించనుంది. ఏది ఏమైనా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వచ్చే జూన్ నాటికి పూర్తి కావాలని.. తెలంగాణ ఆవిర్భావ రెండో వార్షికోత్సం నాటికి.. తెలంగాణ కొత్త జిల్లాలతో కళకళలాడిపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త జిల్లాలకు సంబంధించి కొన్ని డిమాండ్లు ఆచరణ సాధ్యం కాని విధంగా ఉన్నాయని.. ఇలాంటి వాటిని వదిలేయాలని భావిస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఖమ్మం జిల్లాలోని భద్రచలాన్ని.. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి.. మహబూబాబాద్.. జనగామ.. ములుగును జిల్లా చేయాలన్న డిమాండ్ లాంటి వాటిని వదిలేయాలని భావిస్తోంది.

ఇప్పటివరకూ జరిగిన కసరత్తును చూస్తే.. ప్రభుత్వం దృష్టిలో ఉన్న కొత్త జిల్లా ప్రతిపాదనలు చూస్తే..

= హైదరాబాద్ జిల్లా ; ఎలాంటి మార్పులు ఉండవు

= రంగారెడ్డి జిల్లా; ఇప్పుడున్న జిల్లా కేంద్రం కాకుండా చేవెళ్ల కేంద్రంగా కొత్త జిల్లా (ఒక జిల్లా)

= మహబూబ్ నగర్ జిల్లా; షాద్ నగర్ తో పాటు నాగర్ కర్నూలు.. వనపర్తి కేంద్రాలుగా కొత్త జిల్లాలు (3 జిల్లాలు)

= నల్గొండ జిల్లా; భువనగిరి లేదంటే బీబీ నగర్ గా ఒక జిల్లా.. సూర్యాపేట కేంద్రంగా మరో కొత్త జిల్లా (2 జిల్లాలు

= కరీంనగర్ జిల్లా; జగిత్యాల కేంద్రంగా మరో జిల్లా (1 జిల్లా)

= అదిలాబాద్ జిల్లా; మంచిర్యాల కేంద్రంగా మరో జిల్లా (1 జిల్లా)

= మెదక్ జిల్లా; సంగారెడ్డి పేరుతో జిల్లాగా మారి.. మెదక్.. సిద్ధిపేట కేంద్రాలుగా కొత్త జిల్లాలు (2 జిల్లాలు)

= నిజామాబాద్ జిల్లా; కామారెడ్డి కేంద్రంగా మరో జిల్లా (1 జిల్లా)

= ఖమ్మం జిల్లా; కొత్తగూడెం కేంద్రంగా మరో జిల్లా (1 జిల్లా)

= వరంగల్ జిల్లా; కొత్త జిల్లాలు ఉండవు. కాకుంటే.. జనగామను సిద్దిపేట.. లేదంటే భువనగిరి జిల్లాలో కానీ.. డోర్నకల్ ను ఖమ్మం జిల్లాలో కలుపుతారు.