Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కార్ సిగ్గు పోయింది!!

By:  Tupaki Desk   |   20 Dec 2017 3:30 PM GMT
కేసీఆర్ సర్కార్ సిగ్గు పోయింది!!
X
టోకుగా కొంటే మహా అయితే యాభై రూపాయలకు ఓ శాలువా వస్తుంది... టోకుగా ముద్రణ చేయిస్తే ఒకటిరెండు రూపాయలకు ఓ సర్టిఫికెట్ వస్తుంది... ఈ రెండింటినీ మించి వారు కోరుకున్నది కూడా ఏమీ లేదు. వాళ్లేమీ పట్టుపీతాంబరాలు, దుశ్శాలువలూ గండపెండేరాలూ అడగలేదు. ఏదో సభా ముఖంగా తమకు కూడా కాస్త సత్కారం దక్కిందని సంతృప్తి పడడానికి వీలుగా.. భవిష్యత్తులో తమ స్వోత్కర్షకు ఆత్మతృప్తికి అనుకూలంగా నాసిరకమో పాచిరకమో.. ఒక శాలువా ఇస్తే చాలునని ముచ్చట పడ్డారు. కానీ కవుల కోటాలో వారిని ఆహ్వానించి.. ఆ మాత్రం కూడా చేయకుండా తెలంగాణ సర్కార్ సాహితీవేత్తలను అవమానించిందనే అపఖ్యాతిని మూటకట్టుకుంది. ప్రపంచ తెలుగు మహా సభలు అంటూ హైదరాబాదులో సభలు నిర్వహించి.. సభకు రాదలచుకున్న పాల్గొనదలచుకున్న సాహితీ వేత్తలు - భాషాభిమానుల నుంచి వంద రూపాయల సొమ్ము కూడా వసూలు చేసిన తెలంగాణ సర్కార్.. ఆ డబ్బుల దామాషాకు అయినా.. వారికి సత్కారం దక్కకుండా.. అవమానకరంగా వ్యవహరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అయిదురోజులు నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసాయి. 60 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసిన తర్వాత.. ఎంత మాత్రం అట్టహాసంగా చేయగలరో... అంత ఆర్భాటంగానూ సభలను నిర్వహించారు. కాకపోతే అదే రేంజి అపకీర్తిని కూడా మూటగట్టుకున్నారు. ప్రత్యేకించి.. ఒకటే శాలువా, మరియు ఒకటే పూలబొకే తీసుకువచ్చి.. వందల మంది కవులకు దానితోనే సత్కారం జరిపినట్లుగా మమ అనిపించడం. కనీసం వారికి శాలువా వంటి గుడ్డ ముక్క కూడా ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు చాలా పెద్దస్థాయిలో విమర్శలకు గురవుతోంది. సోషల్ మీడియాలో ఈ రకం సమావేశాల నిర్వహణపై సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత.. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని వుంటే కేసీఆర్ ప్రభుత్వం పరువుపోకుండా కాపడగలిగి ఉండేవారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

అలాగే సభలకు జనాల స్పందన కూడా అత్యంత స్వల్పంగా ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం చాలా కష్టపడి.. రాష్ట్రంలో ఉన్న మొత్తం టీచర్లను - ప్రభుత్వోద్యోగులను కార్యక్రమాలకు ప్రేక్షకులుగా తరలించే ప్రయత్నాలు చేసింది. వారందరికీ ఆన్ డ్యూటీ ఇస్తూ బస్సులు ఏర్పాటుచేసి మరీ.. తరలించే ప్రయత్నం చేశారు. ఎన్నిచేసినా ఉత్సవ వేదికలు మాత్రం ఖాళీగానే ఉండి.. కేసీఆర్ ప్రయత్నాన్ని వెక్కిరించాయి. కోట్లు తగలేసిన ఆర్భాటం మిగిలింది గానీ.. సమర్థంగా తెలుగుసభలు నిర్వహించారనే గుర్తింపు మాత్రం దక్కలేదు.