Begin typing your search above and press return to search.

ప్రత్యేక హైకోర్టు కు సెంటిమెంట్ సెంట్ ఎందుకు?

By:  Tupaki Desk   |   1 Aug 2015 5:28 AM GMT
ప్రత్యేక హైకోర్టు కు సెంటిమెంట్ సెంట్ ఎందుకు?
X
ఉద్యమ పార్టీగా తాను అనుకున్న లక్ష్యానికి చేరుకున్న టీఆర్ ఎస్.. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి.. తెలంగాణ అధికారపక్షంగా అవతరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ మరో అంశంపై పెద్ద పోరాటమే చేస్తోంది. రాష్ట్ర విబజనలో భాగంగా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుకొంటోంది. ఇందుకోసం మొదట మామూలుగానే ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో ఉద్యమదిశగా అడుగులు వేస్తోంది.

ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అసాధ్యమేమీ కానప్పటికీ.. దానికి సవాలక్ష పరిమితులుంటాయి. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా న్యాయప్రక్రియకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కాస్త నెమ్మదిగా సాగుతుంటాయి. ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ రాష్ట్రం పోరాడుతుంటే.. ఏపీలో హైకోర్టు నిర్మాణం చేయాలంటూ కేంద్రాన్ని ఏపీ సర్కారు నిలదీయని పరిస్థితి.

అయితే.. మిగిలిన విషయాలలో ఎలాంటి అవకాశం ఇచ్చేందుకు ఇష్టపడని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు విషయంలో ఏపీకి ఒక బంఫర్ ఆఫర్ ఇవ్వటం కనిపిస్తుంది. హైకోర్టును విభజన చేసిన తర్వాత.. కావాలనుకుంటే హైకోర్టు ఏర్పాటు చేసే వరకు హైదరాబాద్ లో ఉండిపోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.

ఉద్యోగుల నుంచి ప్రభుత్వం వరకూ తొందరగా మీ రాష్ట్రానికి మీరు పోవచ్చుగా అంటూ తెంపరితనంతో మాట్లాడే తెలంగాణ అధికారపక్షం.. హైకోర్టు విషయంలో మాత్రం అందుకు భిన్నమైన వాణిని వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఏపీలో హైకోర్టు నిర్మాణం ఇప్పటికిప్పుడు పూర్తి అయ్యేది కాదు. అందుకే.. హైదరాబాద్ లో ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పటం ద్వారా.. ప్రత్యేక హైకోర్టుకు మార్గం సుమగం చేసుకోవాలన్న తాపత్రయమే కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా హైకోర్టు ఏర్పాటు కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ సర్కారు.. ఒక చిత్రమైన వాదనను తెరపైకి తెచ్చింది. తమ హైకోర్టులోనే తమకు న్యాయం జరుగుతుందంటూ చేస్తున్న వ్యాఖ్యలను న్యాయ కోవిదులు మొదలు కొని సుప్రీంకోర్టు సైతం కామ్ గా ఉండటం గమనార్హం. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం చేసిన పోరాటంతో భాగంగా రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక న్యాయమూర్తిపై కోడిగుడ్డు విసిరేసి భౌతిక దాడి జరగాటాన్ని ఎవరూ పట్టించుకోలేదు.

ఉద్యమం చేయటం తప్పేం కాదు. కానీ.. ఆ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ఎంతమాత్రం హర్షనీయం కాదు. అదే విధంగా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం.. ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడటాన్ని ఎవరూ ఏమీ అనరు. కానీ.. ఆ పేరు మీద చేస్తున్న వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై సందేహాలు వ్యక్తమయ్యేలా ఉండటమే అసలుసిసలు అభ్యంతరకరం.

హైకోర్టు సాధన అన్నది న్యాయమైన డిమాండ్ గా ఉండాలే తప్పించి.. దానికి సెంటిమెంట్ ను జోడించాల్సిన అవసరం లేదు. కాకుంటే.. సెంటిమెంట్ రాజకీయాలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తా ఉన్న వారికి.. హైకోర్టు విషయంలో అదే అస్త్రాన్ని ప్రయోగించాలనుకోవటం మామూలే. అయితే.. అన్నింటికి ఒకే మంత్రం పనికి రాదన్నట్లుగా.. నిబంధనల ప్రకారం సాగాల్సిన అంశాల విషయంలో నిబంధనలు మేరకే జరగాలే కానీ.. సెంటిమెంట్ ను రగల్చటం ద్వారా పనులు పూర్తి చేయాలన్న ఆలోచనను తొలి దశలోనే ఖండించాల్సిన అంసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో.. ఇదో చెడు సంప్రదాయంగా మారే వీలుంది.