Begin typing your search above and press return to search.

సమ్మెపై కోర్టుకు ఇచ్చే నివేదికలో టీ సర్కార్ ఏం చెప్పనుంది?

By:  Tupaki Desk   |   28 Oct 2019 5:10 AM GMT
సమ్మెపై కోర్టుకు ఇచ్చే నివేదికలో టీ సర్కార్ ఏం చెప్పనుంది?
X
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఏ తీరులో సాగుతుందన్న విషయం తెలిసిందే. గడిచిన 23 రోజులుగా సాగుతున్న సమ్మెపై ఇప్పటికే తనకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ విషయంలో తాను ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా ఆయన మాటల్ని చూస్తే అర్థం కాక మానదు. ఆర్టీసీ పని అయిపోయిందని.. ఐదారు రోజుల్లో తాను పెట్టే ఒక సంతకంతో సీన్ మొత్తం మారిపోతుందన్నట్లుగా ఇప్పటికే మీడియా మీట్ లో తేల్చేసిన సీఎంకు.. ఈ రోజు హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్నది ప్రశ్నగా మారింది.

కార్మికులతో చర్చలు జరిపి తమకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన మీదట.. కార్మిక సంఘాలతో భేటీని నిర్వహించటం.. ఆ సందర్భంగా ఇరువురి మధ్య చోటుచేసుకున్న భేదాభిప్రాయాలు చర్చల్ని ముందుకు వెళ్లకుండా చేశాయి. చర్చల పేరుతో ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్ప పట్టారు కార్మిక సంఘాల జేఏసీ నేతలు.

తమను అనుమతించకపోవటమేకాదు.. చివరకు సెల్ ఫోన్లు కూడా లోపలకు తీసుకురాకూడదని షరతు పెట్టారని.. చర్చల సందర్భంగా అధికారులు అనుసరించిన వైనం చూస్తే.. కోర్టు చెప్పింది కాబట్టే చర్చలు జరిపామన్నట్లుగా చేశారే తప్పించి.. వారిలో చిత్తశుద్ది ఏమాత్రం లేదన్నది స్పష్టమవుతుందన్నారు.

ఇదిలా ఉంటే.. పండుగ పూట అధికారులతో కలిసి ఆర్టీసీ కార్మికుల విషయంలో హైకోర్టుకు ఇవ్వాల్సిన నివేదిక ఏయే అంశాలు ఉండాలన్న దానిపై కేసీఆర్ కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. తాము చర్చలకు పిలిస్తే.. ఆర్టీసీ కార్మికుల జేఏసీ మాత్రం బహిష్కరించి వెళ్లారన్న విషయాన్ని ప్రభుత్వం తరఫున కోర్టులో చెప్పనున్నట్లుగా చెబుతున్నారు.

సమ్మెకు ప్రత్యామ్నాయ చర్యల్ని స్పీడ్ అప్చేస్తూ.. ఆర్టీసీలో అద్దె బస్సుల్ని పెంచేందుకు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. సమ్మెకు బ్రేకులు వేసేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నా.. ఆర్టీసీ సంఘాల జేఏసీ నేతల నుంచి తమకు సహకారం అందటం లేదన్న విషయాన్ని కోర్టుకు చెప్పే అవకాశం ఉందంటున్నారు. మరి..దీనిపై హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.