Begin typing your search above and press return to search.

15 నెలల్లో 312 ఆత్మహత్యలే నిజమంట

By:  Tupaki Desk   |   28 Sep 2015 5:03 AM GMT
15 నెలల్లో 312 ఆత్మహత్యలే నిజమంట
X
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై.. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలపై విపక్షాలు విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్న వేళ.. వారికి కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా తెలంగాణ సర్కారు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇందుకు తాజాగా విడుదల చేసిన లెక్కలే నిదర్శనంగా చెప్పొచ్చు.

15 నెలల టీఆర్ ఎస్ పాలనలో 1500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని విపక్షాలు చెబుతున్నాయి. ఇంత భారీ సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి.. అసమర్థతకు కారణంగా వారు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. విపక్షాలు.. మీడియా చెబుతున్న గణాంకాలు తప్పన్న రీతిలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త గణాంకాల్ని ప్రస్తావిస్తోంది.

తాజాగా తెలంగాణ సర్కారు లెక్కల ప్రకారం.. గడిచిన 15 నెలల్లో కేవలం 312 మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని.. అవి మాత్రమే నిజమైనవంటూ చేస్తున్న మాటలు రాజకీయ వేడిని మరింత పెంచేలా ఉన్నాయని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 689 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చినా.. అందులో 595 మరణాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని పరిశీలించినట్లు చెబుతున్నారు.

రైతుల ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ లెక్కల ప్రకారం.. 312 మంది అన్నదాతల ఆత్మహత్యలు మాత్రమే నిజమైనవిగా నిర్దారించటం గమనార్హం. నిజమైన ఆత్మహత్యల్లో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వం వహిస్తున్న మెదక్ జిల్లాలో అత్యధిక ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ఇక.. రైతుల ఆత్మహత్యల్లో నిజమైనవి.. అబద్ధమైనవన్న లెక్కలోకి వెళితే.. మెదక్ జిల్లాలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన 160 మంది బలవన్మరణాల్లో 78 మాత్రమే నిజమైనవిగా నిర్దారించారు. ఇక నల్గొండ జిల్లాలో పరిశీలనలోకి వచ్చిన 79 ఆత్మహత్యల్లో 64 మాత్రమే నిజమైనవిగా తేల్చారు.

ఇక.. నిజామాబాద్ లో ఆత్మహత్యలుగా నమోదైన వాటి విషయంలో మరింత ఆశ్చర్యకం కలిగించేలా ఉన్నాయి. ఈ జిల్లాలో 61 మరణాలు ఆత్మహత్యలుగా పేర్కొంటే.. 54 కేసుల్ని మాత్రమే పరిశీలనకు ఓకే చేశారు. వీటిల్లో కేవలం రెండు అంటే రెండు మాత్రమే నిజమైన ఆత్మహత్యలుగా లెక్క కట్టారు.

తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకూ రైతుల ఆత్మహత్యలు 312 మాత్రమేనని.. వారిలో ఇప్పటికే 295 మందికి సాయం అందిట్లు చెబుతున్నారు. అంటే.. ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల్లో ప్రభుత్వ సాయం అందాల్సింది కేవలం 17 మాత్రమేనని తేల్చటం గమనార్హం.

తన పదిహేను నెలల కాలంలో రైతుల ఆత్మహత్యల గురించి ఇలాంటి ‘నిజాలు’ చెబుతున్న తెలంగాణ సర్కారు.. 2004 నుంచి 2013 వరకు మాత్రం 2990 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా తేల్చేయటం విశేషం. తాజాగా తెలంగాణ సర్కారు చెబుతున్న రైతుల ఆత్మహత్యల లెక్కల వ్యవహారం పెను రాజకీయ దుమారాన్ని రేపుతుందన్న అంచనా వ్యక్తమవుతోంది.