Begin typing your search above and press return to search.

విదేశాల నుంచి వచ్చారా? 14 రోజులు ఇంట్లోనే ఉండాలి

By:  Tupaki Desk   |   8 March 2020 4:46 AM GMT
విదేశాల నుంచి వచ్చారా? 14 రోజులు ఇంట్లోనే ఉండాలి
X
అవును.. మీరు చదివింది నిజమే. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి నమోదై.. మరో రెండు కేసులు అనుమానితులుగా ఉన్నారన్న సమాచారమే.. హైదరాబాద్ మహా నగరాన్ని ఎంతలా వణికించిందో శాంపిల్ అనుభవాన్ని చూసిన కేసీఆర్ సర్కారు.. ఈ అంశంపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది.

కరోనా వ్యాప్తి అన్నది ఒకసారి మొదలయ్యాక దాన్ని కంట్రోల్ చేయటం అంత సాధ్యమయ్యే పని కాదు. ఆ విషయాన్ని మొన్నటి ఉదంతంతో అర్థం చేసుకున్న కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై.. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చే వారెవరైనా సరే.. పద్నాలుగు రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

విదేశీ ప్రయాణ సమయంలో ఎవరికైనా కరోనా వైరస్ సోకితే పద్నాలుగు రోజుల తర్వాతే ఆ లక్షణాలు బయటపడతాయి. ఈ అంచనాతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో కరోనా కేసులు రాష్ట్రంలో లేవని తేలిగ్గా తీసుకోవద్దని.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటెల కోరారు. ఏమైనా..కరోనా విషయంలో మొదట్లో పెద్దగా శ్రద్ధ తీసుకోనట్లుగా కనిపించినప్పటికీ.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.