Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మ‌రిన్ని హాలీడే స్పాట్స్‌..!

By:  Tupaki Desk   |   12 Nov 2016 4:09 AM GMT
తెలంగాణ‌లో మ‌రిన్ని హాలీడే స్పాట్స్‌..!
X
ప‌ర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశ‌లో తెలంగాణ స‌ర్కారు కొన్ని కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌స్తోంది! సాగు నీటి అవ‌స‌రాల కోసం రాష్ట్రంలో భారీ ఎత్తున నీటి పారుద‌ల ప్రాజెక్టుల నిర్మాణం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ప్రాజెక్టులనే ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దాల‌ని అనుకుంటోంది. ప్రాజెక్టులు - రిజ‌ర్వాయ‌ర్లకు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే విధంగా అక్క‌డ ఏర్పాట్లు చేయాల‌ని భావిస్తున్నారు. ఈ మేర‌కు కొన్ని ప్ర‌తిపాద‌నలు కూడా ముఖ్య‌మంత్రి సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది.

నూత‌న ప‌ర్యాట‌క విధానం ప్ర‌కారం ప్రాజెక్టుల‌ను ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రాలుగా ప్ర‌మోట్ చేసుకోవ‌డంతోపాటు - సినిమా షూటింగుల‌కు అనువైన‌విగా తీర్చిదిద్దాల‌ని అనుకుంటున్నారు. జ‌ల క్రీడ‌లు - బోటింగ్ వంటి స‌దుపాయాల‌కు ప‌ర్యాట‌కుల కోసం అభివృద్ధి చేయ‌నున్నారు. అలాగే, సినిమా షూటింగుల‌కు ప‌నికొచ్చేలా పెద్ద‌పెద్ద పార్కులు - గ్రీన్ ఫీల్డ్స్ ను కూడా అభివృద్ధి చేస్తారు. అంతేకాదు, ఈ ప్రాంతాల‌కు వ‌చ్చేవారు ఇక్క‌డే కొన్నాళ్లు ఉండేందుకు అనువైన అతిథి గృహాల ఏర్పాట్ల‌పై కూడా ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. నాగార్జున సాగ‌ర్‌ - కిన్నెర‌సాని ప్రాజెక్ట్‌ - మిడ్ మానేరు రిజ‌ర్వాయర్ల‌కు ఇప్ప‌టికే ప‌ర్యాట‌కుల తాకిడి బాగానే ఉంది. వీటితోపాటు - కాళేశ్వ‌రం - ప్రాహిత‌ - క‌ల్వ‌కుర్తి - ఎల్లంప‌ల్లి - శ్రీ‌రామ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను కూడా ప్ర‌మోట్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు.

జ‌లాశ‌యాల్లో బోటింగ్ సౌక‌ర్యంతోపాటు - ఇత‌ర వాట‌ర్ స్పోర్ట్స్ ను కూడా ప‌రిచ‌యం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లూ ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త‌పై ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చాక‌నే ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై ఒక నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెబుతున్నారు. రిక్రియేష‌న్ క్ల‌బ్బులు, ప్రాజెక్ట్ ప‌క్క‌నే స్విమ్మింగ్ పూల్స్‌, ఫుడ్ కోర్టులు, రెసిడెన్షియ‌ల్ సౌక‌ర్యాలు... ఈ ప్ర‌తిపాద‌న‌ల‌న్నింటిపైనా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర ప‌డ‌టమే త‌రువాయి అని చెబుతున్నారు.

గ‌త ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రాష్ట్రానికి వ‌స్తున్న ప‌ర్యాట‌కుల సంఖ్య దాదాపు 20 శాతం పెరిగింద‌ని అంటున్నారు. ప్రాజెక్టుల ప్రాంతాల‌ను ప‌ర్యాట‌క కేంద్రాలు అభివృద్ధి చేస్తే ఆదాయం గ‌ణ‌నీయంగా పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ అభివృద్ధి కార్య‌క్ర‌మాల కోసం కేంద్రం నుంచి కొంత నిధుల‌ను కోర‌తారు. అలాగే, ప్రైవేటు సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో కూడా కొన్ని ప‌నులు చేప‌డ‌తార‌ని తెలుస్తోంది. సో... ఇక‌పై తెలంగాణ‌లో హలీడే స్పాట్స్ సంఖ్య గ‌ణనీయంగా పెరుగుతుంద‌న్న‌మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/