Begin typing your search above and press return to search.

లెక్కల లోతుల్లోకి కోర్టు వెళితే టీ సర్కారుకు చిక్కులేనా?

By:  Tupaki Desk   |   30 Oct 2019 5:20 AM GMT
లెక్కల లోతుల్లోకి కోర్టు వెళితే టీ సర్కారుకు చిక్కులేనా?
X
రెండు వ్యవస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి చాలా అవసరం. పరస్పర మర్యాద.. గౌరవం అత్యవసరం. అయితే.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ హైకోర్టుకు ఇబ్బందికరంగా మారటమే కాదు.. మరింత లెక్కల లోతుల్లోకి వెళ్లేలా చేస్తుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. అప్పటికప్పుడు సర్దుబాటు అయ్యేందుకు వీలుగా దాఖలు చేస్తున్న కౌంటర్ల మీద హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది.

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు అంతకంతకూ ఆగ్రహం పెంచేలా చేస్తోంది. తమ ఆదేశాల్ని అమలు చేసే విషయంలో మోకాలడ్డుతున్న విషయంలో.. ప్రభుత్వం కావాలనే చేస్తుందన్న భావన కలిగేలా పరిణామాలు చోటు చేసుకోవటం.. అందుకు తగ్గట్లే ఆధారాలు కోర్టు ముందుకు రావటం తెలంగాణ ప్రభుత్వానికి ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆర్టీసీ కార్మికులు చేస్తున్నసమ్మె ఎపిసోడ్ ను చూస్తే.. సమ్మె ఆరంభంలో రెండు పక్షాలకు సర్దిచెప్పే ప్రయత్నంతో పాటు.. ఇరువురు తగ్గాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. అయితే.. ఈ ఇష్యూలో తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్న మొండితనాన్ని కోర్టు గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఇందుకు నిదర్శనంగా హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యల్ని చెప్పక తప్పదు.

న్యాయస్థానానికి ప్రభుత్వం సమర్పించిన కౌంటర్ పేలవంగా.. అస్సష్టంగా ఉందని తప్పు పట్టటమే కాదు.. అధికారులు చాలా తెలివిగా.. నర్మగర్భంగా కౌంటర్ వేశారన్న వ్యాఖ్యను చేయటం గమనార్హం. ఐఏఎస్ అధికారుల నుంచి కచ్ఛితమైన గణాంకాలతో కూడిన వాస్తవిక అంశాలతో కౌంటర్ వస్తుందని తాము ఆశించామని.. కానీ అస్పష్టంగా.. ఎటూ తేల్చకుండా సందిగ్దమైన వివరణ ఇవ్వటాన్ని కోర్టు ఎత్తి చూపటం విశేషం. ఆర్టీసీ ఉద్యోగుల వాదనపై కౌంటర్ వేసే విషయంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి తెలివితేటలు ప్రదర్శించారంటూ ఆక్షేపణ చూస్తే.. తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఎంతటి ఆగ్రహాన్ని కలిగి ఉందో అర్థం కాక మానదు.

కోర్టు సహనానికి పరీక్ష పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న మాట న్యాయవాద వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే తీరు మున్ముందు కొనసాగితే.. లెక్కల లోతుల్లోకి కోర్టు వెళ్లే కొద్దీ ప్రభుత్వానికి చిక్కులు తప్పించి.. మరింకేమీ ఉండదని.. అలాంటి పరిస్థితి తెచ్చుకోవటానికి మించిన తెలివి తక్కువ పని ఇంకేం ఉండదన్న విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారికి వినిపిస్తాయంటారా?