Begin typing your search above and press return to search.

తెలంగాణ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల కొత్తపాలసీలో ఏముందంటే?

By:  Tupaki Desk   |   30 Oct 2020 6:15 AM GMT
తెలంగాణ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల కొత్తపాలసీలో ఏముందంటే?
X
మారుతున్న కాలానికి తగ్గట్లు.. కొత్త తరహా విధానాల్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా కనిపిస్తోంది. రానున్న కాలంలో వాహన రంగంలో చోటు చేసుకునే మార్పులకు తగ్గట్లుగా.. తాజాగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల కొత్త పాలసీ.. ప్రజలకు ప్రయోజనకరంగా ఉందని చెప్పక తప్పదు. కొత్త పాలసీలో భాగంగా రానున్న పదేళ్ల కాలానికి సంబంధించి తమ విధానాల్ని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు.. ఎనర్జీ స్టోరేజ్ హబ్ గా మార్చాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం.. తాజాగా తన విధానాన్ని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా రానున్న పదేళ్ల కాలంలో రెండు లక్షల టూ వీలర్.. 20 వేల ఆటోలు.. ఐదు వేల నాలుగు చక్రాల వాహనాలు.. పది వేల లైట్ గూడ్స్ వామనాలు.. ఐదు వేల ఎలక్ట్రిక్ కార్లు.. 500 ఎలక్ట్రిక్ బస్సులకు రహదారి పన్ను.. రిజిస్ట్రేషన్ రుసుమును మినహాయించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఎలక్ట్రానిక్ వాహనాలకు ఊతం ఇవ్వాలన్నా.. రాష్ట్రంలో వాటి వాడకం అంతకంతకూ పెరగాలన్నా.. ఈ తరహా నిర్ణయాలు చాలా అవసరమని చెబుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రికల్ వాహనాల్ని పెద్ద ఎత్తున తీసుకురావటం ద్వారా.. పర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని చెప్పాలి. ఎలక్ట్రికల్ వాహనాలకు ఉన్న సవాళ్లలో అతి పెద్దది.. ఛార్జింగ్ పాయింట్లు.

ఈ విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా.. తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. టైమ్లీగా తీసుకున్న నిర్ణయం.. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మేలు కలిగిస్తుందని చెప్పక తప్పదు. ఎలక్ట్రిక్ వాహనాల్ని ఎంకరేజ్ చేసే పనిలో భాగంగా.. పన్ను మినహాయింపులు సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటున్నారు.