Begin typing your search above and press return to search.

ఒకరోజు ముందు చెప్తే వచ్చే నష్టమేంటి .. ప్రభుత్వం పై హైకోర్టు ఫైర్ !

By:  Tupaki Desk   |   29 April 2021 8:30 AM GMT
ఒకరోజు ముందు చెప్తే వచ్చే నష్టమేంటి .. ప్రభుత్వం పై హైకోర్టు ఫైర్ !
X
తెలంగాణ‌లో కరోనా వైరస్ వ్యాప్తి , రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై ఫైర్ అయింది. ప‌లు కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల‌ ఎన్నిక‌లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధ‌మైన వేళ ఈ అంశాన్ని ప్ర‌స్తావించింది. క‌రోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమంయంలో ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలువైనవా, ఎన్నికలా అని నిల‌దీసింది. ఒక‌వేళ‌ యుద్ధం వచ్చినప్ప‌టికీ, ఆకాశం విరిగి మీద పడినప్ప‌టికీ ఎన్నికలు జరగాల్సిందేనా అని ఎస్‌ ఈసీ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

కొన్ని మునిపాలిటీల్లో ఎన్నిక‌ల‌కు ఇంకా సమయం ఉందని గుర్తు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్న‌ట్లు ఎస్‌ ఈసీ అధికారులు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ, కరోనా రెండో దశ ప్రార‌భ‌మైనా నోటిఫికేషన్‌ ఎందుకు ఇచ్చారని ప్ర‌శ్నించింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్‌ ఈసీకి లేదా అని నిల‌దీసింది. ఎస్‌ ఈసీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపింది. ఈ విష‌యంపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అస‌లు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయం అడగాల్సిన అవసరం ఏంటని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. రేపటితో కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుందని, తర్వాత కరోనా కట్టడి కోసం తీసుకోబోతున్న‌ చర్యలేంటని కోర్టు ప్రశ్నించింది. దీనికి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ,రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానమివ్వ‌డంతో దీనిపై కోర్టు మండిప‌డింది. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమిటంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకని ప్రశ్నించింది. కనీసం ఒక రోజు ముందు చెబితే నష్టమేంటని మండిపడింది. నియంత్రణ చర్యలపై తామ ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదని హైకోర్టు తెలిపింది. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది.