Begin typing your search above and press return to search.

ప్రయాణికుల రైలుకి 24 బోగీలే ఉండాలా ..ఏ చట్టంలో ఉందంటూ హైకోర్టు ప్రశ్న!

By:  Tupaki Desk   |   23 Jun 2020 7:45 AM GMT
ప్రయాణికుల రైలుకి 24 బోగీలే ఉండాలా ..ఏ చట్టంలో ఉందంటూ హైకోర్టు ప్రశ్న!
X
ఈ వైరస్ నుండి దేశాన్ని కాపాడటానికి లాక్ డౌన్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ..ప్రజారవాణా పూర్తిగా స్తంభించిపోయింది. అలాగే పనులన్నీ కూడా ఆగిపోయాయి. దీనితో వలస కార్మికుల కష్టాలు అన్ని ఎన్ని కావు. ఉన్నచోట తిండి లేక ,..సొంత ఊర్లకి వెళ్లలేక నానా అవస్థలు పడ్డారు ..ఇంకా పడుతున్నారు. దీనితో కేంద్రం శ్రామిక రైళ్లు ఏర్పాటు చేసి ..చాలామంది వలస కార్మికుల్ని వారి సొంత రాష్ట్రాలకి తరలించింది.

అయితే , ఇంకా అక్కడక్కడా కొంతమంది వలస కార్మికులు కొంతమంది చిక్కుకుపోయారు. వారి కోసం ప్రత్యేకంగా శ్రామిక్ రైలుని ఏర్పాటు చేయకుండా ..సాధారణ ప్రయాణికుల రైలుకు శ్రామిక్ బోగీని తగిలించి తరలించాలని అనుకున్నారు. కానీ , దీనికి దక్షిణ మధ్య రైల్వే అనుమతి ఇవ్వలేదు. దీనితో వలస కార్మికులను తరలించేందుకు సాధారణ రైలుకు ఒక బోగీ ప్రత్యేకం గా ఏర్పాటు చేయడం ఎందుకు వీలు కాదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ విచారణ కు హాజరు కావాలని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికులను వారి రాష్ట్రాలకు పంపేలా ఉత్తర్వులు ఇవ్వాలని, లాక్‌డౌన్‌ వల్ల వారంతా ఇబ్బందులు పడుతున్నారని దాఖలైన మూడు పిల్స్‌ను సోమవారం మరోసారి విచారించింది. గూడ్స్‌ రైలుకు 70 బోగీలు ఉంటాయని, సాధారణ రైలుకు 24కి మించి బోగీలు ఉండకూడదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని ప్రశ్నించింది.

వలస కార్మికుల విషయంలో రైల్వే శాఖ ఎందుకు ఉదాసీనంగా ఉంటోందో.. వలస కార్మికుల కోసం ఒక అదనపు బోగీ ఏర్పాటు చేసేందుకు ఉన్న అడ్డంకులు ఏంటో తమకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించింది. వలస కార్మికుల కష్టాలను చూస్తే డీఆర్‌ఎం స్పందించే వారని పేర్కొంది. పర్యాటకుల కోసం ఒకట్రెండు రోజులు ఖాళీగానే ఉంచుతారని, అలాంటిది వలస కార్మికుల కోసం ఎందుకు అలా చేయలేదని ప్రశ్నించింది. బిహార్‌కు చెందిన 45 మంది వలస కార్మికుల కోసం శ్రామిక్‌ రైలును రూ.10 లక్షలు ఖర్చు చేసి ప్రభుత్వం కూడా ఎలా నడపగలదని అడిగింది.