Begin typing your search above and press return to search.

కరోనా వేళ... 'వలస' కు హైకోర్టు భరోసా

By:  Tupaki Desk   |   27 April 2020 3:30 PM GMT
కరోనా వేళ... వలస కు హైకోర్టు భరోసా
X
ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న వేళ... తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుయ వెలువరించింది. కరోనా నేపథ్యంలో అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ తో ఎక్కడికక్కడ చిక్కుబడిపోయిన వలస కార్మికులను వారి ఇళ్లకు చేర్చాల్సిందేనని తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఏమిటో కూడా తమకు తెలపాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ ను ఆదేశిస్తూ సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ తీర్పునకు దారి తీసిన పరిస్థితులను ఓ సారి పరిశీలిస్తే... కరోనా వైరస్ ఒక్కసారిగా ప్రబలడంతో దేశవ్యాప్తంగా మార్చి ఆఖరు వారంలో ఉన్నట్టుండి లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లో గడచిన నెల రోజులుగా వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుబడిపోయారు. సొంతూళ్లకు వద్దామంటే అడుగు ముందుకు పడటానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా వలసకు వెళ్లిన చోటే ఉందామంటే చేయడానికి పని లేదు. తినడానికి తిండీ లేదు. దీంతో వలస కార్మికులు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో వలస కార్మికుల ఇబ్బందులపై తెలంగాణ హైకోర్టులో పలు స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను ఆయా స్వచ్ఛంద సంస్థలు కోర్టు దృష్టికి తీసుకు వచ్చాయి. ఈ క్రమంలోనే హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు - సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించాలని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపించడం సాధ్యం కాదా? అని ప్రశ్నించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి ఈ విషయంలో సమగ్రమైన అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను మే 11వ తేదీకి వాయిదా వేసింది.