Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల్లో సోమేష్ కుమార్‌.. నెక్ట్స్ జ‌రిగేది ఇదే!

By:  Tupaki Desk   |   10 Jan 2023 5:15 PM GMT
రాజ‌కీయాల్లో సోమేష్ కుమార్‌.. నెక్ట్స్ జ‌రిగేది ఇదే!
X
తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న డాక్ట‌ర్ సోమేష్‌కుమార్‌కు న్యాయ‌స్థానంంలో చుక్కెదురైం ది. ఆయ‌న‌ను ఏపీకి బ‌దిలీ చేయాల్సిందేన‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ ప‌రిణామంతో ఆయ‌న అధికారిగా నే ఉండిపోతే.. ఖ‌చ్చితంగా ఆయ‌న ఏపీలో అడుగు పెట్టాలి. అయితే.. దీనికి ఆయ‌న కానీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కానీ, ఇష్ట‌ప‌డే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు.

ఈ క్ర‌మంలో సోమేష్ కుమార్‌తో విధుల‌కు రాజీనామా చేయించే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది. వాలం ట‌రీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించి.. త‌ద్వారా.. వెంట‌నే రాజకీయాల్లోకి ఆయ‌న‌ను తీసుకునే ప‌రిస్థితి ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఆయ‌న ఎలానూ రిటైర్ కావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను ముందుగానే వాలంట‌రీ రిటైర్మెంట్ చేయించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ఇక‌, తెలంగాణ రాజ‌కీయాల్లో కొట్టిన పండి వంటి పేరు తెచ్చుకున్న సోమేష్ కుమార్‌.. సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన అధికారి. కేసీఆర్ నోటి వెంట ఏది వ‌చ్చినా.. అది ఆచ‌ర‌ణ‌లో పెడుతూ.. ఎంత క‌ఠిన విష‌యం అయినా.. అమ‌లు చేస్తూ.. సీఎం వ‌ద్ద మంచి మార్కులు సంపాయించుకున్నారు. గ‌తంలో జీహెచ్ ఎంసీ క‌మిష‌నర్‌గా ఉన్న‌ప్పుడు కార్మికుల ఆందోళ‌న‌ను ఉక్కుపాదంతో అణిచి వేసి.. కేసీఆర్ ఆశీస్సులు పొందారు.

ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ఆయ‌న‌కు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టును అప్ప‌గించారు. త‌ర్వాత‌.. ఆర్టీసీ ఉద్యోగులు ఉద్య‌మించిన‌ప్పుడు కూడా.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వారిని చ‌ర్చ‌ల‌కు కూడా పిల‌వ‌కుండా లైన్‌లోకి తెచ్చేలా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, తాజాగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ వివాదంలోనూ.. కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే సోమేష్ కుమార్ ప‌నిచేశారు. ఇలా.. మొత్తంగా ఆయ‌న సీఎంకు చాలా అనుకూల‌మైన అధికారిగా ముద్ర వేసుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న‌ను వ‌దులుకునేందుకు కేసీఆర్ సుత‌రామూ ఇష్ట‌ప‌డ‌రు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు బీఆర్ ఎస్ కండువా క‌ప్పి.. అటు జాతీయ రాజ‌కీయాల్లోనో.. ఇటు ప్రాంతీయ రాజ‌కీయాల్లోనో దింపే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.