Begin typing your search above and press return to search.

50 వేల మాట చెప్పిన జీహెచ్ఎంసీకి టీ హైకోర్టు పంచ్

By:  Tupaki Desk   |   2 Sep 2021 9:30 AM GMT
50 వేల మాట చెప్పిన జీహెచ్ఎంసీకి టీ హైకోర్టు పంచ్
X
తమను తాము గొప్పగా చెప్పుకునే సంస్థల మాటలకు వారి చేతలకు ఏ మాత్రం పోలిక.. పొంతన ఉండదు. తాజాగా అలానే వ్యవహరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు తెలంగాణ హైకోర్టు భారీ పంచ్ ఇచ్చింది. ఒక కేసు విచారణలో భాగంగా జీహెచ్ఎంసీ తరఫున వినిపించిన వాదన విషయంలో సీరియస్ అయ్యింది. వినాయకచవితి నేపథ్యంలో నిమజ్జనం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. వారు చేపట్టనున్న కార్యక్రమాల మీద హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ తరఫున 50వేల గణేశ్ విగ్రహాల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఎవరికి వారు వారి ఇంట్లోనే మట్టి వినాయకుడ్ని చేసుకోవాలని తాము ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మాటకు హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జంట నగరాల్లో జనాభా ఎంత? మీరిచ్చే 50వేల ఉచిత విగ్రహాలు ఏమూలకు వస్తాయి? విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశాం.. బాధ్యత అయిపోయిందని అనుకుంటే ఎలా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ధర్మాసనం.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా.. మట్టి విగ్రహాల్ని ఏర్పాటు చేసేలా చేయాలని.. నేచురల్ కలర్స్ ను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరగా.. అన్ని విగ్రహాల్ని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 16 ప్రత్యేక నీటి కొలనుల్ని నిర్మించారని.. వాటిని వాడుకోకుండా మెజార్టీ విగ్రహాల్నిహుస్సేన్ లోనే చేస్తున్నట్లుగా జీహెచ్ఎంసీ వెల్లడించింది.

వినాయక మండపాల్ని ఏర్పాటు చేసే వారికి.. వాటికి అనుమతి ఇచ్చే సమయంలోనే సమీపంలోనిచెరువుల్లో నిమజ్జనం చేసేలా సూచనలు చేయాలని హైకోర్టు కోరింది. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల కారణంగా లౌడ్ స్పీకర్లతో శబ్ద కాలుష్యం.. విగ్రహాల నిమజ్జనంతో ఏర్పడే జల కాలుష్యంతో ఇబ్బంది పడతారని పేర్కొంది. ఒకరి మత విశ్వాసాల కోసం ఇంకొకరిని ఇబ్బందులుగురి చేయటం సరికాదని హైకోర్టు స్పస్టం చేసింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా.. మండపాల వద్ద.. నిమజ్జనం సమయంలోనూ జనం గుమి గూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. మరేం జరుగుతుందో చూడాలి.