Begin typing your search above and press return to search.

ధాన్యం కొనుగోళ్లు: హైకోర్టు సంచలన ఆదేశాలు

By:  Tupaki Desk   |   6 Dec 2021 4:30 PM GMT
ధాన్యం కొనుగోళ్లు: హైకోర్టు సంచలన ఆదేశాలు
X
తెలంగాణలో వరిధాన్యం కొనుగోళ్లు ఇప్పుడు దేశవ్యాప్త సమస్య అయ్యింది. పార్లమెంట్ లోనూ కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీలు నిలదీస్తుండడంతో ఇప్పుడు ఈ సమస్య బర్నింగ్ వివాదంగా మారింది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మాటల దాడి దీనిపై కొనసాగుతోంది. తాజాగా వరిధాన్యం కొనుగోలుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. లా విద్యార్థి బొమ్మనగిరి శ్రీకర్ ఈ పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటీషనర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఏ చట్టప్రకారం ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలో చెప్పాలంది హైకోర్టు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు అందేలా చూడాలని పిటీషన్ కోరారు. ధాన్యం దళారులు దోచుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు.

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తూ చనిపోయిన 700 మంది రైతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం  ప్రకటించిందని.. ప్రతి రైతు కుటుంబాలకు 3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హైకోర్టు పేర్కొంది.

జనవరి చివరి వరకూ ధాన్యం కొనుగోలు చేస్తూనే ఉంటామని ఏజీ కోర్టుకి తెలిపారు. ఏజీ వాదనను పరిగణలోకి తీసుకొని ధాన్యం కొనుగోలుకు అన్ని ప్రయత్నాలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. జనవరి 3వ వారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.