Begin typing your search above and press return to search.

అంబులెన్సుల్ని ఆపేస్తారా? ఇది మానవత్వమేనా? : ప్రభుత్వానికి హైకోర్టు సూటిప్రశ్న !

By:  Tupaki Desk   |   11 May 2021 6:58 AM GMT
అంబులెన్సుల్ని ఆపేస్తారా? ఇది మానవత్వమేనా? : ప్రభుత్వానికి హైకోర్టు సూటిప్రశ్న !
X
తెలంగాణ, ఏపీ మధ్య కరోనా వైరస్ చిచ్చు కొనసాగుతోంది. ఏపీ నుంచి హైదరాబాద్‌ కు వస్తున్న కరోనా పేషెంట్లను తెలంగాణ పోలీసులు, సరిహద్దుల నుంచే వెనక్కి పంపడం దుమారాన్ని రేపుతోంది. అయితే , ఆస్పత్రుల్లో బెడ్స్‌ బుక్ చేసుకోకుండా వస్తున్న వారినే ఆపుతున్నామంటున్నారు తెలంగాణ పోలీసులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశల్‌ మధ్య కరోనా తీవ్ర ప్రభావం మొదలైనప్పటి నుంచి ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరత వెంటాడుతోంది. ఏపీ నుంచి వచ్చే వారిలో ఎక్కువ మందికి హైదరాబాద్ ఆస్పత్రుల్లో అడ్మిషన్, బెడ్ లేదనే వాదన ఉంది. దీంతో.. ఆస్పత్రి నుంచి లెటర్, బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే అంబులెన్సులను పోలీసులు అనుమతిస్తున్నారు. లేకుంటే,వాటిని వెనక్కి పంపిచేస్తున్నారు. తాజాగా నేడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. ఈ విచారణ లో భాగంగా సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారని కేసీఆర్‌ సర్కారును ప్రశ్నించింది.

రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తగ్గిండంపై ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. ఇక పాతబస్తీలో కరోనా నిబంధనలు పాటించడం లేదన్న న్యాయస్థానం, లాక్‌ డౌన్‌ విధిస్తారా లేదా నిబంధనలు కఠినతరం చేస్తారో చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ఉందని, సమావేశం అనంతరం లాక్‌ డౌన్‌, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. కరోనాను కట్టడి చేయడానికి విధిలేని పరిస్థితుల్లో ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆందోళనకర స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన అజెండాలో లాక్ డౌన్ విధించే అంశమే కీలకమని చెపుతున్నారు. సంపూర్ణ లాక్ డౌన్ విధించడంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే, ఈ కర్ఫ్యూ వల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. పాజిటివ్ కేసులు యథావిధిగా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో, లాక్ డౌన్ విధించడమే బెటర్ అనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం. మొత్తంగా సాయంత్రం లోపు లాక్ డౌన్ పై స్పష్టమైన క్లారిటీ వచ్చేలా ఉంది.