Begin typing your search above and press return to search.

చంద్రబాబు, వీర్రాజుకు షాకిచ్చిన తెలంగాణా హైకోర్టు

By:  Tupaki Desk   |   8 Sep 2021 5:31 AM GMT
చంద్రబాబు, వీర్రాజుకు షాకిచ్చిన తెలంగాణా హైకోర్టు
X
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలో ఎందుకు ? అంటు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు వేసిన ప్రశ్న. ఈ ప్రశ్న చంద్రబాబు ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంధించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన టెలి కాన్ఫరెన్సులో మాట్లాడుతూ జగన్ హిందు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నట్లు మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్సార్ వర్దంతి సందర్భంగా లేని ఆంక్షలు వినాయక చవితి ఉత్సవాలకే వచ్చిందా ? అంటు రెచ్చిపోయారు.

జగన్ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని 175 నియోజకవర్గాల్లోని నేతలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తు చవితి ఉత్సవాలను జరపాలంటూ పిలుపిచ్చారు. మరోవైపు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కూడా ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలే వేస్తు ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని జనాలకు పిలుపిచ్చారు. అయితే పిలుపిచ్చిన 24 గంటల్లోనే వీళ్ళద్దరికి తెలంగాణా హైకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా విచారణ జరిగింది.

ఈ సందర్భంగా కరోనా వైరస్ నేపథ్యంలో చవితి ఉత్సవాల పేరుతో జనాలు గుమిగూడకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పమని ప్రభుత్వాన్ని నిలదీసింది. వినాయక చవితి ఉత్సవాల పేరుతో జనాలంతా ఒకచోట గుమికూడితే మళ్ళీ కరోనా వైరస్ విజృంభించే ప్రమాదముందని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో కోర్టుకు వివరించాలని ఆదేశించింది. కార్యాచరణ రూపొందించటమే కాకుండా కచ్చితంగా అమలయ్యేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో కూడా తమకు వెంటనే తెలియజేయాలని హైకోర్టు గట్టిగా చెప్పింది.

కరోనా వైరస్ నేపధ్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఎవరిళ్ళల్లో వాళ్ళు జరుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తి ఏపిలో రాజకీయంగా ఎంతటి వివాదమవుతోందో అందరు గమనిస్తున్నదే. జగన్ విజ్ఞప్తిని బీజేపీ, టీడీపీలు హిందు వ్యతిరేక విధానాలుగా ముద్రవేసి మరీ గోలచేస్తున్నాయి. ఎక్కడ అవకాశం దొరికినా జగన్ను హిందు వ్యతిరేక వ్యక్తిగా ముద్ర వేయటానికి వీర్రాజుతో పాటు చంద్రబాబు కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే వీళ్ళు మరచిపోయిందేమంటే జగన్ ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిందేమీ కాదని. కేంద్ర ప్రభుత్వం ఆగష్టు 28వ తేదీన అన్ని రాష్ట్రాలకు జారీచేసిన మార్గదర్శకాలనే ఏపిలో జగన్ ప్రభుత్వం కూడా జారీచేసింది. దీనిపైనే వీర్రాజు, చంద్రబాబు నానా గోలచేస్తున్నారు. తాము చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు తెలంగాణాను మద్దతుగా చూపించుకుంటున్నారు. అయితే విచారణలో భాగంగా జనాలు గుమిగూడకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్న హైకోర్టు ఆదేశాలు వీళ్ళిద్దరి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే అయిపోయింది. మరిపుడు వీళ్ళద్దరు ఏమి చేస్తారో చూడాలి.