Begin typing your search above and press return to search.

35 మంది ఐఏఎస్ లు.. 7 గంట‌లు..!

By:  Tupaki Desk   |   14 July 2017 4:56 AM GMT
35 మంది ఐఏఎస్ లు.. 7 గంట‌లు..!
X
తెలంగాణ రాష్ట్రంలో మ‌హ‌బూబాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్రీతిమీనాపై ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ అనుచితంగా వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రి సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంతం నేప‌థ్యంలో 35 మంది ఐఏఎస్ లు ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఐఏఎస్ అధికారుల సంఘం గురువారం మంజీరా అతిధి గృహంలో స్పెష‌ల్ గా మీటింగ్ పెట్టుకున్నారు.

ఈ స‌మావేశం ఏకంగా ఏడు గంట‌ల పాటు సాగ‌టం గ‌మ‌నార్హం. క‌లెక్ట‌ర్ ప్రీతిమీనా పై ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రిని తీవ్రంగా ఖండించిన వారు.. ఈ ఉదంతంపై వెంట‌నే స్పందించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరును ప్ర‌శంసించారు. అదే స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌ను వేగంగా పూర్తి చేయాల‌ని.. ద‌ర్యాప్తును పూర్తి పార‌ద‌ర్శ‌కంగా చేప‌ట్టాల‌ని పోలీసుల్ని కోరారు.

ఏడు గంట‌ల సుదీర్ఘ స‌మావేశంలో ఒక్క ప్రీతిమీనా అంశం మాత్ర‌మే కాకుండా.. ఇటీవ‌ల కాలంలో వివిధ జిల్లాల్లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. జిల్లా స్థాయిలో రాజ‌కీయ నేత‌ల నుంచి ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల పైనా చ‌ర్చ సాగిన‌ట్లుగా చెబుతున్నారు. భ‌విష్య‌త్తులో మ‌హ‌బూబాబాద్ ఎపిసోడ్ లాంటివి జ‌ర‌గ‌కుండా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న అంశంపైనా చ‌ర్చ సాగింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్పీ సింగ్‌ ను క‌ల‌వాల‌ని నిర్ణ‌యించారు. వీరి భేటీ ఈ రోజు (శుక్ర‌వ‌రాం) జ‌ర‌గ‌నుంది.