Begin typing your search above and press return to search.

ఐదు జిల్లాల్లోనూ 'శంక‌ర్ దాదా'లేన‌ట‌

By:  Tupaki Desk   |   15 July 2017 4:34 AM GMT
ఐదు జిల్లాల్లోనూ శంక‌ర్ దాదాలేన‌ట‌
X
హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో ఒక జిల్లా క‌లెక్ట‌ర్‌ ను అధికార‌పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేయి ప‌ట్టుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది. త‌నప‌ట్ల అనుచితంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌జాప్ర‌తినిధి తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లారు స‌ద‌రు క‌లెక్ట‌రమ్మ‌. సాధార‌ణంగా ఇలాంటివి ఏమైనా చోటు చేసుకున్న‌ప్పుడు ఆవేద‌న చెంద‌టం.. స‌న్నిహితుల ద‌గ్గ‌ర త‌మ ఇబ్బందిని వెళ్ల‌బోసుకోవ‌టం త‌ప్పించి.. బ‌య‌ట‌కు రావ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు.

అందుకు భిన్నంగా మ‌హబూబాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్రీతిమీనా మాత్రం త‌న‌కు ఎదురైన ఇబ్బందిని ధైర్యంగా బ‌య‌ట‌కు చెప్ప‌ట‌మే కాదు.. ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్లేలా చేశారు. చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి సైతం ఈ ఇష్యూపై స్పందించి సీరియ‌స్ అయ్యేలా చేశారు. తాజా ఎపిసోడ్ తో ఒక్క‌సారిగా మ‌హిళా ఐఏఎస్ అధికారుల‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌పై చ‌ర్చ మొద‌లైంది. ప్రీతిమీనా విష‌యంపై చ‌ర్చించేందుకు స‌మావేశ‌మైన ఐఏఎస్ అధికారుల మీటింగ్ లో ఐఏఎస్ లు ఎదుర్కొంటున్న అంశాల‌పై లోతుగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే ఎపిసోడ్ నేప‌థ్యంలో ఈ త‌ర‌హా ఇబ్బందులు ఎదుర్కొంటున్న త‌ర‌హాలోనే మ‌రో ఐదుగురు జిల్లాల్లోనూ ఐఏఎస్ ల‌కు ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. అదే ప‌నిగా కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ‌ను వేధిస్తున్న విస‌యాన్ని ప‌లువురు ఐఏఎస్ అధికారులు సీనియ‌ర్ల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

రాజ‌కీయ ఒత్తిళ్లు మామూలే అయిన‌ప్ప‌టికీ.. అవి శ్రుతిమించి పోతున్న‌ట్లుగా వారు వాపోయిన‌ట్లుగా తెలుస్తోంది. జ‌న‌గాం జిల్లాకు సంబంధించిన చ‌ర్చ కాస్త ఎక్కువ‌గా జ‌రిగిన‌ట్లు స‌మాచారం. మెద‌క్ జిల్లాలో క‌లెక్ట‌రేట్ స్థ‌లానికి సంబంధించి అక్క‌డి అధికార పార్టీ నేత ఒక‌రు ఒత్తిడి చేశార‌ని తెలుస్తోంది. నిజామామాద్ జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం.. ఇసుక ర‌వాణాకు సంబంధించి ఇద్ద‌రు నేత‌ల నుంచి రాజ‌కీయ ఒత్తిళ్లు పెరిగిపోయిన‌ట్లుగా ఐఏఎస్ అధికారులు ప్ర‌స్తావించిన‌ట్లుగా తెలుస్తోంది. క‌రీంన‌గ‌ర్ లోనూ అధికార పార్టీ నేత‌లు కొంద‌రు అన‌వ‌స‌ర‌మైన విష‌యాల్లో త‌ల‌దూరుస్తున్నార‌ని చెప్పుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఐఏఎస్ అధికారుల‌పై అధికార‌ప‌క్ష నేత‌ల తీరుపై ముఖ్య‌మంత్రి దృష్టి సారిస్తే.. విష‌యం మొత్తంగా సెట్ అవుతుంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.