Begin typing your search above and press return to search.

ఒక్క రోజు వేడి చ‌ల్లారిపోయింది!

By:  Tupaki Desk   |   18 Sep 2021 7:31 AM GMT
ఒక్క రోజు వేడి చ‌ల్లారిపోయింది!
X
ప్ర‌తి ఏడాది సెప్టెంబ‌ర్ 17 రాగానే.. తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి మ‌రోస్థాయికి చేరుతుంది. తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌తి ప‌క్ష పార్టీలు.. అది విమోచ‌నం కాదు విలీన‌మ‌ని అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వం.. ఇలా ఎవ‌రికి న‌చ్చిన వాద‌న‌లు వాళ్లు చేస్తారు. మొత్తానికి ఈ రోజును రాజ‌కీయాల కోసం బాగానే వాడుకుంటున్నార‌నే అభిప్రాయం ఉంది. అన్ని పార్టీలు జాతీయ జెండాను ఎగ‌రేసి విమోచ‌న దినోత్సవంపై త‌మ పార్టీ సిద్ధాంతాన్ని ప్ర‌కటించేసి సైలెంట్ అయిపోతాయి. ఈ సారి మునుపెన్న‌డూ లేని విధంగా ఈ రోజుపై రాజ‌కీయ వేడి బాగానే రేకెత్తింది. నిర్మ‌ల్‌లో బీజేపీ బ‌హిరంగ స‌భ‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజ‌రు కావ‌డం.. ఇటు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గం గ‌జ్వేల్‌లో కాంగ్రెస్ స‌భ నిర్వ‌హించ‌డం.. ఇలా రాష్ట్ర రాజ‌కీయాల్లో సెప్టెంబ‌ర్ 17 కాక పుట్టించింది.

అయితే ఎప్ప‌టిలాగే ఒక్క రోజు మాత్రమే ఉండే ఈ రాజ‌కీయ వేడి ఇప్పుడు చ‌ల్లారిపోయింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హించేందుకు సీఎం కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నార‌ని మ‌జ్లిస్ పార్టీ కొమ్ము కాస్తున్నార‌ని తాము అధికారంలోకి రాగానే మొద‌ట‌గా విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా ప్ర‌క‌టించే ద‌స్త్రంపై సంత‌కం చేస్తామ‌ని బ‌హిరంగ స‌భ‌లో బీజేపీ ప్ర‌క‌టించింది. అమిత్ షా కూడా ఆ విష‌యంపై కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ‌లో పాద‌యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు తోడుగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ స‌భ భారీ స్థాయిలో విజ‌య‌వంతం కావ‌డంతో కాషాయ శ్రేణుల్లో స‌రికొత్త ఉత్సాహం వ‌చ్చింది. మ‌రింత దూకుడుతో ముందుకు సాగేందుకు కావాల్సిన శ‌క్తిని ఈ స‌భ అందించింద‌ని నిపుణులు చెబుతున్నారు.

మ‌రోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక సెప్టెంబ‌ర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినోత్స‌వంగా నిర్వ‌హిస్తామ‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇక గ‌జ్వేల్‌లో ఏర్పాటు చేసిన ద‌ళిత గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దండోరా ముగింపు స‌భ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆయ‌న నిప్పులు చెరిగారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌శ్నిస్తూ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో కేసీఆర్ విఫ‌ల‌మ‌య్యారంటూ ఛార్జీషీట్ విడుద‌ల చేశారు. ఈ స‌భ‌కు కూడా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత దూకుడు పెంచిన రేవంత్‌కు ఈ స‌భ విజ‌య‌వంతం కావ‌డం మ‌రింత జోష్ ఇచ్చేదే. రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ‌గా సెప్టెంబ‌ర్ 17ను వ‌క్రీక‌రించి బీజేపీ ప‌బ్బం గ‌డుపుతుంద‌ని సీపీఎం పొలిట్‌బ్యూరో స‌భ్యుడు బీవీ రాఘవులు అన్నారు. విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని సీపీఐ డిమాండ్ చేసింది.

సెప్టెంబ‌ర్ 17 విమోచ‌న దినోత్స‌వం కాద‌ని.. విలీన దినోత్స‌వమ‌ని అధికార టీఆర్ఎస్ మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. విలీన దినోత్స‌వానికి అర్థం తెలీని పార్టీలు నానా యాగీ చేస్తున్నార‌ని టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత కె.కేశ‌వ‌రావు పేర్కొన్నారు. మొత్తానికి త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం సెప్టెంబ‌ర్ 17ను అన్ని పార్టీలు వాడుకుంటున్నాయ‌ని రాజ‌కీయ నిపుణులు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ విముక్తి కోసం ఎంతోమంది ప్రాణాలు వ‌దిలి అమ‌రుల‌య్యార‌ని వాళ్ల త్యాగాల‌కు గుర్తింపునివ్వాల్సిన ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక విమోచ‌నం.. విలీనం అంటూ మ‌రో ఏడాది వ‌ర‌కూ ఎలాంటి చ‌ర్చ‌లు.. విమ‌ర్శ‌లు ఉండ‌వ‌ని మ‌ళ్లీ సెప్టెంబ‌ర్ 17 వ‌స్తే అన్ని పార్టీల‌కు ఆ విష‌యం గుర్తుకు వ‌స్తుంద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.