Begin typing your search above and press return to search.

ఏపీలో ప‌ని చేసేందుకు తెలంగాణ ఐపీఎస్ ల ఆస‌క్తి!

By:  Tupaki Desk   |   25 May 2019 4:46 AM GMT
ఏపీలో ప‌ని చేసేందుకు తెలంగాణ ఐపీఎస్ ల ఆస‌క్తి!
X
మారిన ఫ‌లితాల నేప‌థ్యంలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌ని ఐఏఎస్ లు.. ఐపీఎస్ ల‌ను చూశాం. ఏపీ క్యాడ‌రే అయినా ఏపీకి వెళ్లేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని వారెంద‌రో. అలాంటిది తాజాగా వెలువ‌డిన ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో తెలంగాణ క్యాడ‌ర్ కు చెందిన ప‌లువురు ఐపీఎస్ అధికారులు డిప్యుటేష‌న్ మీద ఏపీకి వెళ్లేందుకు ఆస‌క్తి చూపిస్తున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏపీలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఘ‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ప‌లువురు తెలంగాణ క్యాడ‌ర్ ఐపీఎస్ అధికారులు ఏపీకి డిప్యుటేష‌న్ మీద వెళ్లేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వీరే కాక దివంగ‌త మ‌హానేత వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప‌ని చేసిన ప‌లువురు మాజీ ఐపీఎస్ లు ఇప్పుడు రిటైర్ అయి ఉన్నారు. వారంతా ఏపీ ప్ర‌భుత్వంలో ప‌ని చేయాల‌న్న ఆస‌క్తితో ఉన్నారు.

తాజాగా తెలంగాణ క్యాడ‌ర్ కు చెందిన ఒక సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఇప్ప‌టికే అమ‌రావ‌తి వెళ్లి జ‌గ‌న్ ను క‌లిసిన‌ట్లుగా తెలుస్తోంది. తాను ఏపీలో ప‌ని చేయాల‌న్న ఆస‌క్తిని ఆయ‌న వ్య‌క్తం చేయ‌టం.. దానికి జ‌గ‌న్ సానుకూలంగా స్పందించిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ నెల 30న ప్ర‌మాణ‌స్వీకారం చేసిన త‌ర్వాత ఇలాంటి రిక్వెస్ట్ ల‌ను ఒక కొలిక్కి తేవాల‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం తెలంగాణ‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్ లు ఏపీలో ప‌ని చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. వీరిలో ముగ్గురు నాన్ కేడ‌ర్ ఐపీఎస్ లు కావ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ‌లో తాము ప్ర‌మోష‌న్లు పొందినా.. త‌మ స్థాయి కంటే త‌క్కువ పోస్టుల్లో ప‌ని చేయ‌టంతో వారిప్పుడు ఏపీకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు వైఎస్ సీఎంగా ప‌ని చేసిన‌ప్పుడు ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసిన వారు.. ఇప్పుడుజ‌గ‌న్ తో క‌లిసి ప‌ని చేయాల‌ని భావిస్తున్నారు. ఇంట‌ర్ స్టేట్ డిప్యుటేష‌న్ కింద అధికారులు ఏపీకి వెళ్లే అవ‌కాశం ఉన్నందున‌.. ప‌లువురు తెలంగాణ క్యాడ‌ర్ ఐపీఎస్ లు ఏపీకి వెళ్ల‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.