Begin typing your search above and press return to search.

కేసీఆర్ చెప్పింది కాగ్ క‌న్ఫ‌ర్మ్ చేసింది

By:  Tupaki Desk   |   26 May 2017 5:02 AM GMT
కేసీఆర్ చెప్పింది కాగ్ క‌న్ఫ‌ర్మ్ చేసింది
X
తెలంగాణ ధ‌నిక రాష్ట్రంగా.. సంప‌న్నమైన‌దిగా త‌ర‌చూ చెబుతుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఆయ‌న చెప్పిన మాట‌లు అక్ష‌ర స‌త్యాల‌న్న విష‌యాన్ని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ తాజాగా స్ప‌ష్టం చేసింది. తాజాగా విడుద‌ల చేసిన నివేదిక‌లో 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్ర‌ధాన ప‌న్నుల ద్వారానే కాదు.. అన్ని ర‌కాల ప‌న్నుల ద్వారా వ‌చ్చే ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది.

అమ్మ‌కం ప‌న్ను.. ఆబార్కీ.. స్టాంపులు-రిజిస్ట్రేష‌న్ లాంటి ప్ర‌ధాన ప‌న్నుల్లో 17.82 శాతం వృద్ధిరేటు సాధించ‌గా.. అన్ని ర‌కాల ప‌న్నులతో 17.81 శాతం వృద్ధిరేటును తెలంగాణ సొంతం చేసుకుందని పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్రానికి ప్ర‌ధాన ప‌న్నుల ద్వారా వ‌చ్చింది రూ.33,257 కోట్ల ఆదాయం కాగా.. 2016-17 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ 39,183 కోట్ల ఆదాయం వ‌చ్చింద‌ని.. తెలంగాణ ప్ర‌ధాన ప‌న్నుల ద్వారా 17.82 శాతం ఆదాయ‌వృద్ధి రేటును పెంచుకుంద‌ని పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో 15 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా ఈసారి వృద్ధిరేటు మ‌రింత పెర‌గ‌టం విశేషం.

ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కూ తాను చెప్పిన‌ట్లే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ అని.. సంప‌న్న రాష్ట్ర‌మ‌న్న విష‌యాన్ని కాగ్ చెప్పింద‌ని.. తాను చెప్పిన మాట‌లు నిజ‌మ‌ని మ‌రోసారి తేలింద‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా.. ఏపీ విష‌యానికి వ‌స్తే జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. ప్ర‌ధాన ప‌న్నుల ద్వారా వ‌చ్చే ఆదాయ వృద్ధిరేటు 9.01 శాతంగా న‌మోదైంది. అదే స‌మ‌యంలో అన్ని ప‌న్నుల రూపంలో వ‌చ్చే ఆదాయం వృద్ధి రేటు సైతం ఏడో స్థానంలో నిల‌వ‌టం గ‌మ‌నార్హం. 2015-16లో రూ.36,297 కోట్ల ఆదాయం రాగా.. 2016-17లో ఇది రూ.39,907 కోట్లుగా తేలింది. ఇక‌.. శాతాల్లో చూస్తే ఇది కేవ‌లం 9.94 శాతం మాత్ర‌మే కావ‌టం గ‌మ‌నార్హం. వృద్ధి శాతంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య తేడా దాదాపు ఏడు శాతానికి పైగా ఉంది. అదే రూపాయిల్లో చూస్తే.. రెండు రాష్ట్రాల మ‌ధ్య వ్య‌త్యాసం రూ.2.7 వేల కోట్లు మాత్ర‌మే ఉంది. అంటే.. వృద్ధిశాతంగా చూసిన‌ప్పుడు భారీగా ఉన్న‌ప్పటికీ.. రూపాయిల్లో వ్య‌త్యాసం కాస్త త‌క్కువ‌గానే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఏమైనా.. కేసీఆర్ చెప్పిన‌ట్లే తెలంగాణ రాష్ట్రం ఆదాయ వృద్ధిలో దేశంలోనే తొలిస్థానంలో నిలిచిన వైనాన్ని కాగ్ క‌న్ఫ‌ర్మ్ చేసింద‌ని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/