Begin typing your search above and press return to search.

8వ రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ.. ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం

By:  Tupaki Desk   |   17 March 2020 3:43 AM GMT
8వ రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ.. ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం
X
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. మొదటి నుంచి సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ ను వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని ఒప్పుకోబోమని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కుండబద్ధలు కొట్టినట్లు అసెంబ్లీ వేదికగా మరోసారి తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా సోమవారం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్, ఏఐఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపాడు. సమావేశం నుంచి బయటకు వచ్చి తీర్మానం ప్రతులను చింపేశారు. అయితే సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేయగా తెలంగాణ 8వ రాష్ట్రంగా నిలిచింది.

తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తాము స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. చట్టంలో ఒకలా ఉంటే.. ప్రజల మధ్య మాత్రం కేంద్రమంత్రులు మరో తీరు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఒక వర్గాన్ని దూరం చేసేందుకు తెచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో కొంతమంది బీజేపీ ఎంపీలు, మంత్రుల నోట చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు విన్నామని, ‘గోలీ మార్‌ సాలోంకో’ అనే దానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మంచిని ఆశించి.. ఎవరి శ్రేయస్సును ఆశించి.. ఎవరి భవిష్యత్తును ఆశించి చేశారని ప్రశ్నించారు. దేశంలో అనేక సమస్యలున్నా అనవసరంగా ఎన్నార్సీ, ఎన్సీఆర్, సీఏఏ తీసుకొచ్చి కల్లోలం రేపారని ఆరోపించారు. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠ ఏమవుతుందని? ఇది హిందువులు, ముస్లింల సమస్యల కాదు. యావత్‌ భారత ప్రజల సమస్య అని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దేశానికి మంచిది కాదని తెలిపారు. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సమీక్ష చేయాలని సూచించారు. కావాలంటే జాతీయ గుర్తింపు కార్డు తెండి మద్దతు ఇస్తామని ప్రకటించారు. మా దేశ ప్రభుత్వం మా కోసం పని చేస్తుందని ప్రజలు అనుకోవాలని అనేలా ఉండాలని తెలిపారు. ప్రజలు వినియోగిస్తున్న ఓటరుకార్డులు పౌరసత్వానికి రుజువులు కావా అని ప్రశ్నించారు. కోట్లమంది ప్రజల్లో అనుమానాలు ఉన్నప్పుడు సీఏఏ విషయం లో ముందుకెళ్లడం మంచిది కాదని తెలిపారు. ఒక మతాన్ని మినహాయిస్తూ చేసే రాజ్యాంగ వ్యతిరేక చర్యకు మద్దతు తెలిపేది లేదని స్పష్టంచేశారు. సీఏఏ అన్నది కేవలం హిందూముస్లింల సమస్య కాదన్నారు. నిరసనల తో ఇప్పటికే దేశం నలుమూలలా లొల్లి అంటుకొన్నదని.. ఇలాంటప్పుడు విభజన రాజకీయాలు దేశానికి అవసరమా అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని పునస్సమీక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

రెండున్నర గంటలకు పైగా చర్చ తర్వాత సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీపై పునఃసమీక్ష చేయాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే ఈ తీర్మానం చేయడంపై ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటాలకు తెలంగాణవ్యాప్తంగా పాలాభిషేకాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.