Begin typing your search above and press return to search.

జాతీయం కంటే తెలంగాణ అధికం: కేటీఆర్‌ కు కేసీఆర్ ప్ర‌శంస‌లు

By:  Tupaki Desk   |   21 May 2020 12:32 PM GMT
జాతీయం కంటే తెలంగాణ అధికం: కేటీఆర్‌ కు కేసీఆర్ ప్ర‌శంస‌లు
X
ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ప‌లు అంశాల్లో స‌త్తా చాటుతోంది. తాజాగా ఐటీ ఉత్ప‌త్తుల్లో తెలంగాణ అద్భుతంగా ప‌ని చేసి జాతీయ ఐటీ వృద్ధి రేటు క‌న్నా తెలంగాణ అధికంగా ఉంది. ఈ విష‌యాన్ని ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ వార్షిక నివేదికను గురువారం సీఎం కె.చంద్ర‌శేఖ‌ర్ రావు‌కు సమర్పించారు. ఐదేళ్లుగా ఎగుమతుల్లో ఐటీ మంచి పనితీరు కనబరుస్తోంద‌ని సీఎం కేసీఆర్ ఐటీ శాఖను అభినందించారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఐటీ ఎగుమతులు 17.93 శాతం వృద్ధితో రూ.1,28,807 కోట్లకు చేరాయి. భారత ఐటీ వృద్ధి రేటు కంటే తెలంగాణ ఐటీ వృద్ధి రేటు రెట్టింపు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమ 8.09 శాతం పురోగతి సాధించి రూ.11,12,496 కోట్లకు చేరింది. దేశంలో 43.63 లక్షల మంది ఐటీ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 5.80 లక్షల మందికిపైగా ఐటీ ద్వారా ఉపాధి పొందుతున్నారు.

2018-19 ఆర్థిక సంవత్సరంలోనూ తెలంగాణ ఐటీ ఎగుమతులు 17 శాతంగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఐటీ ఎగుమతుల విలువ రూ.1,09,219 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2017-18లో తెలంగాణ ఐటీ ఎగుమతులు 10.30 శాతం వృద్ధి చెంది రూ. 93,400 కోట్లకు చేరాయి. 2016-17లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ.85,475 కోట్లు.

తెలంగాణ ఆవిర్భవించిన తొలి ఏడాది 15.70 శాతం పురోగతితో ఐటీ ఎగుమతుల విలువ రూ.66 వేల కోట్లకు చేరింది. 2014-15లో ఐటీ రంగం 3.71 లక్షల మందికి ఉపాధి కల్పించింది. ఆరేళ్లలో తెలంగాణ ఐటీ ఎగుమతులు దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఐటీ ప‌నిత‌నంపై సీఎం కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను అభినందించారు.