Begin typing your search above and press return to search.

‘ఉచితాల’ పేరిట బీజేపీ ద్వంద్వ నీతి.. కడిగేసిన టీఆర్ఎస్

By:  Tupaki Desk   |   15 Sep 2022 12:30 PM GMT
‘ఉచితాల’ పేరిట బీజేపీ ద్వంద్వ నీతి.. కడిగేసిన టీఆర్ఎస్
X
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), భారతీయ జనతా పార్టీ (బిజెపి)ల మధ్య మరోసారి ‘ఉచితాల’లొల్లి మొదలైంది. ఈ 'ఉచిత పథకాల’ విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

తెలంగాణలో ఉచిత ఇళ్లు, విద్య, వైద్యం వంటి బీజేపీ హామీలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.టి.ఆర్ గురువారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "తెలంగాణ బిజెపి మూర్ఖత్వం అబ్బురపరుస్తుంది. విశ్వగురుడు మోడీ ఉచితాలు వద్దు అని చెబుతుండగా, ఈ జోకర్ ఎంపి (బండి సంజయ్) ఉచిత విద్య, ఆరోగ్యం & ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చాడు" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీలపై టీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశాడు. ఇది ఉచితాలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న వైఖరికి విరుద్ధంగా ఉందని కేటీఆర్ సెటైర్ వేశాడు. "ఈ దేశాన్ని పాలిస్తున్నది బిజెపి కాదా? దేశం మొత్తానికి ఉచిత ఇళ్ళు, విద్య & ఆరోగ్యంపై పార్లమెంటులో శాసనం చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు" అని కేటీఆర్ ప్రశ్నించారు.

భారతదేశంలోని 28 రాష్ట్రాల పేద ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం మరియు ఉచిత డబుల్ బెడ్ రూం గృహాల కోసం పార్లమెంట్ లో తీర్మానం చేయాలని.. టిఆర్‌ఎస్ మద్దతుగా ఓటు వేస్తుందని కేటీఆర్ తెలిపారు. బీజేపీ తెలంగాణ వాగ్దానాలకు అనుగుణంగా పార్లమెంట్‌లో చట్టం తేవాలని ప్రధానిని డిమాండ్‌ చేశారు.

బుధవారం కూకట్‌పల్లిలో ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత ఇళ్లు, ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కార్ మాత్రం ఈ ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రాలను ఇవ్వవద్దని సుప్రీంకోర్టుకు విన్నవించింది. రాజకీయంగా వాడుకుంటోంది. ‘రేవాడి’ సంస్కృతి అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో ఉచితాలపై చర్చకు తెర లేపినప్పటి నుంచి టీఆర్‌ఎస్ నేతలు సంక్షేమ పథకాలను గట్టిగా సమర్థిస్తున్నారు. బీజేపీ ఉచితాలకు వ్యతిరేకంగా దుమ్మెత్తిపోస్తున్నారు.

మోదీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించడమే కాకుండా.. సామాన్యుల జీవితాలను మరింత దుర్భరంగా మార్చేందుకే ఇప్పుడు ఉచితాల దొంగనాటకాలు ఆడుతూ హామీలు ఇస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు తెస్తుంది కానీ దానితో పనికిమాలిన పనులు చేస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సంక్షేమం కోసం ఏవైనా పథకాలు ప్రవేశపెడితే పథకాలపై విషం చిమ్ముతోంది. వాటిని ఉచితాలుగా ముద్రవేస్తున్నారు’’ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.

ఇలా కేంద్రంలోని పెద్దలు ఉచిత పథకాలకు వ్యతిరేకంగా గళం విప్పుతుంటే అదే పార్టీకి చెందిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం తెలంగాణలో అధికారం కోసం ఉచిత పథకాలు ఇస్తానంటూ పేర్కొనడం దుమారం రేపింది. దీన్నే కేటీఆర్ ఎండగట్టిన పరిస్థితి నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.