Begin typing your search above and press return to search.

బీజేపీ బీజియ‌మ్ : జిగ్నేశ్ దారిలో కేటీఆర్ అరెస్టు షురూ !

By:  Tupaki Desk   |   23 April 2022 7:30 AM GMT
బీజేపీ బీజియ‌మ్ : జిగ్నేశ్ దారిలో కేటీఆర్ అరెస్టు షురూ !
X
ద‌ళిత నాయ‌కుడు జిగ్నేశ్ మేవాణీ దారిలోనే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తారక రామారావు వెళ్తున్నారు. ఆ విధంగా ఆయ‌న జిగ్నేశ్ వ్యాఖ్యల‌ను ప్ర‌ముఖ ప్ర‌సార మాధ్య‌మంలో మ‌రోసారి ఉటంకించి వార్త‌ల్లో నిలిచారు. ట్రోల‌ర్స్ కు మంచి వీడియో ఫుటేజ్ ను అందించారు. ఆ విధంగా ఆయ‌న మ‌రో మారు బీజేపీకి స‌వాల్ చేస్తూ, ద‌మ్ముంటే త‌న‌ను అరెస్టు చేయాల‌ని బ‌హిరంగ స‌వాల్ విసిరారు. అయితే ఈ సవాలును ఇంత వ‌ర‌కూ బండి సంజ‌య్ వినలేదు మ‌రియు వినిపించుకోలేదు కూడా ! కిష‌న్ రెడ్డి కూడా విన‌లేదు మ‌రియు వినిపించుకోలేదు కూడా !

దేశ ప్ర‌ధాని మోడీకి ఎవ్వ‌రైనా హిందీలో అనువ‌దించి కేటీఆర్ తెలుగు మాట‌ల‌ను, ఉద్రిక్త పోక‌డ‌ల‌ను వివ‌రించారో లేదో కూడా ప్ర‌స్తుతానికి తెలియ‌దు. వాస్త‌వానికి ఎప్పటి నుంచో పొలిటిక‌ల్ మైలేజ్ లో భాగంగా కేటీఆర్ త‌న‌దైన వేగం పెంచుకుని మాట్లాడుతున్నారు. ద‌ళిత నాయ‌కుడు మ‌రియు గుజ‌రాత్ యువ‌కుల ఆశాజ్యోతి, వ‌డ‌గాం నియోజ‌క‌వ‌ర్గ శాస‌న స‌భ్యులు (స్వ‌తంత్ర‌) ఇటీవ‌ల మోడీని ఉద్దేశించి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అవే ఇప్పుడు మ‌రింత వివాదాలకు తావిస్తున్నాయి. మోడీని అనుచిత రీతిన ఓ వ్య‌క్తితో పోలుస్తూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే వ్య‌వ‌హారం శ్రుతి మించేలా చేశాయి. ట్విట‌ర్ వ‌ర్గాలు కూడా అప్ర‌మ‌త్తం అయి ఆ వ్యాఖ్య‌లు తొల‌గించాయి.

ఇదే సంద‌ర్భంలో కేటీఆర్ మరోసారి అవే మాట‌లు చెప్పి వివాదాల‌కు ఆజ్యం పోశారు. ఒక‌వేళ బీజేపీ స‌ర్కారు క‌నుక ఎక్క‌డో ఓ చోట కేసు న‌మోదు చేసి, లేదా చేయించి విద్వేష పూరిత వ్యాఖ్య‌ల‌ను ప్రోత్స‌హిస్తున్న నేప‌థ్యాన ఆయ‌న్ను అరెస్టు చేస్తే తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు మ‌రింత సానుభూతి పెరుగుతుంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి మ‌రింత బ‌లం పుంజుకుంటుంది. అందుకే తెలివిగా కేటీఆర్ స్పందించి, జిగ్నేశ్ మేవాణీ వ్యాఖ్య‌లు మ‌రోసారి చేసి త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ను నిరూపించుకున్నారు. ఆ విధంగా ఆయ‌న తండ్రికి త‌గ్గ కొడుకు అనిపించుకున్నారు. త‌న తండ్రి ని ఉద్దేశించి ఎవ్వ‌రు ఏ మాట అన్నా స‌హించేది లేద‌ని తేల్చేశారు.

ఆయ‌న ప్ర‌జ‌ల మెప్పుతో రెండు సార్లు ముఖ్య‌మంత్రి గా ఎన్నిక‌యిన వ్య‌క్తి అని పున‌రుద్ఘాటించారు. మ‌రి ! ఇదే స‌మ‌యాన కొంద‌రు తెలంగాణ రాష్ట్ర స‌మితి వ్య‌తిరేకులు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. వ‌య‌సు రీత్యా కేసీఆర్ ను ఏమీ అనకూడ‌దు కానీ అదే వ‌య‌సును కూడా ప‌రిగ‌ణించ‌కుండా మోడీని కేటీఆర్ ప‌రోక్ష రీతిలో తిట్ట‌వ‌చ్చా అని ప్ర‌శ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇదే స‌మ‌యాన మ‌రికొన్ని వ్యాఖ్యలు కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. రాముడ్ని ఉద్దేశించి క్ష‌త్రియుడు అయిన ఆర్జీవీ వ్యాఖ్య‌లు చేస్తే అరెస్టే లేదు. కానీ ద‌ళితుడు అయిన క‌త్తి మ‌హేశ్ ను ఆ రోజు న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ చేశారు. ఇదెంత వ‌ర‌కూ న్యాయం అని నిల‌దీస్తున్నారు కేంద్రాన్ని కొంద‌రు క‌మ్యూనిస్టులు.

అదేవిధంగా ఇప్పుడు ద‌ళిత నాయ‌కుడు అయిన జిగ్నేశ్ మేవాణీని అరెస్టు చేసినంత ఉత్సాహంగా రేప‌టి వేళ తెలంగాణ‌లో ఒక్క శాతం కూడా లేని వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన కేటీఆర్ ను అరెస్టు చేయ‌గ‌ల‌రా అని కూడా కేంద్ర ప్ర‌భుత్వాన్ని వారు నిల‌దీస్తున్నారు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ దేశ ప్ర‌ధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల వివాదం అటు జిగ్నేశ్ ను బాధ‌పెట్టినంత‌గా, ఇబ్బంది పెట్టినంత‌గా కేసీఆర్ ను ఇబ్బంది పెట్ట‌వ‌ని వాటికి పున‌రుక్తి దోషం అంట‌నే అంట‌ద‌ని తేల్చేస్తున్నారు ఇంకొంద‌రు ప్ర‌జా స్వామ్య సంఘాల ప్ర‌తినిధులు. క‌నుక కేటీఆర్ అరెస్టు సాధ్యం కాని ప‌ని అని నిర్థారిస్తున్నారు సంబంధిత వ్య‌క్తులు మ‌రియు వ‌ర్గాలు కూడా !