Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత్ కిషోర్ పెద్ద తోపేమీ కాదు: కేటీఆర్‌

By:  Tupaki Desk   |   25 April 2022 7:30 AM GMT
ప్ర‌శాంత్ కిషోర్ పెద్ద తోపేమీ కాదు: కేటీఆర్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌.. ఈ రాష్ట్రాల మ‌ధ్య సారూప‌త్య లేక‌పోవచ్చు.. కానీ ఈ రాష్ట్రాల్లో రాజ‌కీయాల్లో ఒక పోలిక ఉంది. ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు గ‌త ఎన్నిక‌ల్లో గెలిచేలా ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ఆయా పార్టీల త‌ర‌పున ప‌ని చేశారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అలాంటి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌తో ప‌నిచేయాల‌ని పార్టీలన్నీ ఎదురు చూస్తున్నాయి. కానీ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మాత్రం పీకే పెద్ద తోపేమీ కాద‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర సీఎం, టీఆర్ఎస్ అధినేత అయిన త‌న తండ్రి కేసీఆర్‌.. పీకే కంటే గొప్ప వ్యూహ‌క‌ర్త అని కేటీఆర్ అన్నారు.

మారుతున్న స‌మీకర‌ణాలు..

వ‌చ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నిక‌ల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. కానీ రెండు సార్లు అధికారంలో కొన‌సాగుతుండ‌డంతో స‌హ‌జంగానే టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలున్నాయి. ఇక ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల కార‌ణంగా ఇప్పుడా వ్య‌తిరేక‌త మ‌రింత పెరిగింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దీంతో ఎన్నిక‌ల కోసం పీకే సాయం తీసుకునేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు. త‌న‌కు చెందిన ఐ ప్యాక్ టీమ్‌తో తెలంగాణ‌లో పీకే స‌ర్వేలు చేయించి ఆ నివేదిక‌లు కేసీఆర్‌కు అందిస్తున్నారు. కొన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని, కొన్ని స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చాల్సి ఉంటుంద‌ని ఆయ‌న కేసీఆర్‌కు సూచించారు. కానీ ఇప్పుడు పీకే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌డంతో కేసీఆర్ ఏం చేస్తార‌నే ప్ర‌శ్న వినిపిస్తోంది.

కీల‌క స‌మావేశాలు..

ఈ నేప‌థ్యంలో తాజాగా కేసీఆర్‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో పీకే రెండు రోజుల పాటు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జాతీయ రాజ‌కీయాలు, రాష్ట్రంలో ప‌రిస్థితుల‌పై వీళ్లు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే పీకేకు చెందిన ఐ ప్యాక్‌తో క‌లిసి ప‌ని చేయాల‌నే కేసీఆర్ నిర్ణ‌యించార‌ని టాక్‌. ఈ నిర్ణ‌యంపై తాజాగా కేటీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ ప‌నిచేసేది ఐ ప్యాక్‌తో మాత్ర‌మేన‌ని పీకేతో కాద‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌శాంత్ కిషోర్‌ను మించిన వ్యూహ‌క‌ర్త కేసీఆర్ అని పేర్కొన్నారు. ఐ ప్యాక్ టీమ్ ఆకాశం నుంచి ఏదో తీసుకు వ‌స్తుంద‌ని భావించ‌డం లేద‌ని సోష‌ల్ మీడియా ద్వారా పార్టీని బలోపేతం చేసేలా దాని సేవ‌లు వినియోగించుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో పీకేను మించిన వ్యూహ‌క‌ర్త కేసీఆర్ అయితే మ‌రి పీకే సాయం ఎందుకు తీసుకుంటున్నార‌ని విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి.