Begin typing your search above and press return to search.

ఏక‌కాలంలో రేవంత్‌ - కోదండ‌రాంకు త‌గిలిన షాక్ ఇది

By:  Tupaki Desk   |   1 Dec 2018 5:17 AM GMT
ఏక‌కాలంలో రేవంత్‌ - కోదండ‌రాంకు త‌గిలిన షాక్ ఇది
X
మ‌హాకూట‌మి పేరుతో జ‌ట్టుక‌ట్టిన విప‌క్షాల్లో ఐక్య‌త కంటే అల‌క‌లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా వ‌రుస‌గా ఆయా పార్టీల నేతలు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం స్థాపించిన తెలంగాణ జ‌న‌సమితి ఊహించ‌ని రీతిలో చిక్కులు ఎదుర్కుంటోంది. ఇప్ప‌టికే టికెట్ల కేటాయింపు - నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఖ‌రారు చేసే ఉదంతంలో చుక్క‌లు చూసిన కోదండ‌రాం సారుకు ఇంకో షాక్ త‌గిలింది. అది కూడా కాంగ్రెస్‌ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో క‌లిపి కావ‌డం గ‌మనార్హం. ఈ ఇద్ద‌రు షాకిస్తూ టీజేఎస్ నేత టీఆర్ ఎస్‌ కు జై కొట్టారు.

కూటమిలో ఐక్యత మేడిపండును మరిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. సీట్ల కేటాయింపు విషయంలోనే భాగస్వామ్య పక్షాలను రాచిరంపాన పెట్టిన పెద్దన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ అధే ధోరణిని కొనసాగిస్తున్నది. పలు నియోజకవర్గాల్లో మిత్రపక్షాల అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇతరులను బరిలో దింపి వారికి వెన్నుపోటు పొడుస్తున్నది. దీన్ని జీర్ణించుకోలేక ఆగ్రహంతో రగిలిపోతున్న పలువురు టీజేఎస్ నాయకులు టీఆర్‌ ఎస్‌ పార్టీలో చేరుతున్నారు. తాజా ఎపిసోడ్ విష‌యానికి వ‌స్తే - కొడంగల్‌ లో రేవంత్ రెడ్డి బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. కొడంగల్ నుంచి పోటీచేసేందుకు రంగం సిద్ధంచేసుకున్న టీజేఎస్ నేత న‌ర్మ‌ద‌కు కూటమిలో సీట్ల సర్దుబాటు వల్ల ఆ అవకాశం లభించలేదు. దీంతో కొడంగ‌ల్‌ నియోజకవర్గ టీజేఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా నర్మద బ‌రిలో నిలిచారు. తాజాగా టీఆర్‌ ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌ రెడ్డికి ఆమె మద్దతు ప్రకటించారు. కూటమిలో తమకు సముచితస్థానం లభించలేదని, అందుకే తామంతా మూకుమ్మడిగా టీఆర్‌ ఎస్‌ లో చేరి నరేందర్‌ రెడ్డి మద్దతు ప్రకటిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. వీరంతా టీఆర్‌ ఎస్‌ లో చేరడంతో నియోజకవర్గంలో టీజేఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

ఇదిలాఉండ‌గా, దుబ్బాక టీజేఎస్ అభ్యర్థి చిందం రాజ్‌ కుమార్ కాంగ్రెస్‌ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీట్ల సర్దుబాటులో భాగంగా తనకు కేటాయించిన నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత ఉపేందర్‌ రెడ్డికి ఆ పార్టీ బీ-ఫాం ఇచ్చి నమ్మకద్రోహానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఎన్నికల ప్రచారం కోసం నియోజకవర్గానికి వస్తే ఆత్మహత్య చేసుకొంటానని రాజ్‌ కుమార్ హెచ్చరించారు.