Begin typing your search above and press return to search.

విధ్వంసం చేసేటోళ్లకు అలా.. శాంతియుత నిరసన వేళ కేసీఆర్ సర్కారు ఇలా?

By:  Tupaki Desk   |   18 Jun 2022 5:30 PM GMT
విధ్వంసం చేసేటోళ్లకు అలా.. శాంతియుత నిరసన వేళ కేసీఆర్ సర్కారు ఇలా?
X
సమస్య ఏదైనా ఉండొచ్చు. కారణం ఏదైనా కావొచ్చు. తమ డిమాండ్లను వినిపించటానికి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటానికి ఒక పద్దతి పాడు అన్నది ఉంటుంది కదా? ఎంత కడుపు మండితే మాత్రం.. మనసుకు తోచింది చేయటం న్యాయమేనా? అన్నది మరో ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ఒకే సమయంలో చోటు చేసుకున్న రెండు ఆందోళనలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. తమ సమస్యల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు నాలుగు రోజులుగా ఎండకు ఎండి.. వానకు తడిచి.. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పడుతూ పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు.

ఈ నిరసనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న వారు సానుకూలంగా స్పందించింది లేదు. దీనికి బదులుగా నిరసన చేస్తున్న విద్యార్థుల్ని కలిసేందుకు వస్తున్న విపక్ష నేతల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి నిరసనకు మద్దతు ప్రకటించేందుకు వస్తున్న నేతల్ని అడ్డుకోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

ఇదిలా ఉంటే.. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం.. ఇందులోని కొన్ని అంశాల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ విధ్వంసకాండను క్రియేట్ చేస్తున్న వైనం తెలిసిందే. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో జరిగిన విధ్వంసకాండ.. అరాచకానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా మారింది.

వేలాది మంది పౌరులకు తీవ్ర కష్టాలు కలిగేలా చేయటంతో పాటు.. విలువైన ఆస్తుల్ని నష్టపోయేలా చేశారు. రైల్వే స్టేషన్ లోని ట్రాక్ మీద ఉండే రాళ్లను ఆయుధాలుగా చేసుకుని పోలీసులపై దాడి చేయటం.. దొరికిన ఆస్తుల్ని దొరికినట్లుగా ధ్వంసం చేయటం చేశారు. ఇంత తీవ్రంగా విధ్వంసకాండకు పాల్పడిన ఆందోళనాకారుల తీరును తీవ్రంగా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది.

అయితే.. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిరసనకారుల చర్యల్ని తప్పు పట్టటం అటు ఉంచి.. కేంద్రం తీరు కారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరసనకారులని పేర్కొనటం.. వారి చేసే విధ్వంస చేష్టలకు మద్దతు తెలిపేలా చేస్తున్న చర్యలు షాకింగ్ గా మారాయి.

ఓవైపు శాంతియుతంగా వేలాది మంది విద్యార్థులు నిరసన చేస్తుంటే స్పందించేందుకు ఆసక్తి చూపని కేసీఆర్ సర్కారు.. అందుకు భిన్నంగా సికింద్రాబాద్ స్టేషన్ లో విధ్వంసాన్ని క్రియేట్ చేసిన వారి విషయంలో ముఖ్యమంత్రి.. మంత్రి చేసిన ప్రకటనలు.. సోషల్ మీడియాలో పోస్టుల(మంత్రి కేటీఆర్)పై ఇప్పుడు చర్చ జరుగుతోంది.