Begin typing your search above and press return to search.

కమలంతో టీడీపీని కలవనీయకుండా చేస్తున్న తెలంగాణా నేత...?

By:  Tupaki Desk   |   16 Dec 2022 9:07 AM GMT
కమలంతో టీడీపీని కలవనీయకుండా చేస్తున్న తెలంగాణా నేత...?
X
తెలంగాణా నుంచి ఏపీ రాజకీయాలను నరుక్కురావాలని చంద్రబాబు చూస్తున్నారు. దాంతో ఆయన ఈ మధ్య తెలంగాణా ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో టీడీపీ పోటీ చేయడానికి కూడా డిసైడ్ అయింది. అయితే పొత్తులతో రావాలని చూస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి సింహ భాగం సీట్లు ఇచ్చి మిగిలినవి తాను పోటీ చేయడం ద్వారా తెలంగాణాలో గెలవాలనుకుంటోంది.

అదే టైం లో ఏపీలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీని సులువుగా ఓడించవచ్చు అని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆయన తెలంగాణాలో టీడీపీని బలోపేతం చేస్తున్నారు. అయితే తెలంగాణాలో టీడీపీతో పొత్తుకు ఒక కీలక నేత కేంద్రంలో పదవులు నిర్వహిస్తున్న నాయకుడు అడ్డుపడుతున్నారు అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయనకు బీజేపీ కేంద్ర పెద్దల వద్ద మంచి పరిచయాలు ఉండడం, ఆయన చెప్పినది బీజేపీ అధినేతలు వినే పరిస్థితి ఉండడంతో ఆయన టీడీపీతో పొత్తు వద్దు అని అంటున్నారుట.

తెలుగుదేశంతో పొత్తు ఉంటే బాగా నష్టపోతామని కూడా చెబుతున్నారుట. 2018లో అలాగే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండూ పొత్తులకు వెళ్ళి దెబ్బతిన్నాయని గుర్తు చేస్తున్నారుట. నిజానికి ఆ లీడర్ కి తెలుగుదేశాన్ని చేరదీయకపోవడం వెనక వేరే ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనకు ఏపీలోని వైసీపీ నాయకులతో కూడా మంచి రిలేషన్స్ ఉండడం వల్లనే ఆయన వారి మాట మేరకు బీజేపీని టీడీపీతో ఎక్కడా కలనవీయకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.

తెలంగాణాలో బీజేపీతో పొత్తు కుదిరితే అది అక్కడితో ఆగదు ఏపీలో కూడా కొనసాగుతుంది. అపుడు ఈ రెండు పార్టీలతో జనసేన కూడా చేరుతుంది. అంటే 2014 నాటి పొత్తులు రిపీట్ అవుతాయన్న మాట. అదే జరిగితే వైసీపీకి ఏపీలో ఇబ్బంది అవుతుందని, ఓడిపోతుందన్న ఆలోచనతో వైసీపీ నేతలు సదరు తెలంగాణా లీడర్ ద్వారా బీజేపీ టీడీపీ తెలంగాణా పొత్తులకు గండికొడుతున్నారని అంటున్నారు. కేంద్ర పెద్దలు మాత్రం దీని మీద ఏమంటారో తెలియడంలేదు అని చెబుతున్నారు.

ఇక చూస్తే తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ కి అయితే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావాలీ అంటే కచ్చితంగా టీడీపీతో పొత్తు ఉండాలని ఉందిట. ఆయన ఇదే విషయం పదే పదే కేంద్ర పెద్దలకు చెప్పి ఉంచారట. తెలంగాణాలో టీడీపీకి బలం చాలా ఉందని, ఉత్తర తెలంగాణా జిల్లాలలో గెలవాలీ అంటే టీడీపీ సహకారం కూడా తప్పనిసరి అని ఆయన చెబుతున్నారుట. ముఖ్యంగా హైదరాబాద్ ఖమ్మం, నల్గొండ వంటి చోట్ల బీజేపీ గెలుపునకు టీడీపీ బాగా హెల్ప్ అవుతుంది అని ఆయన తన విశ్లేషణలు వినిపించారుట.

అయితే కేంద్రం వద్ద గట్టి పట్టున్న ఆ లీడర్ మాటలనే కేంద్ర పెద్దలు వుంటున్నారుట. అందువల్లనే తెలుగుదేశానికి వారు ఎస్ అని చెప్పడంలేదు అని అంటున్నారని చెబుతున్నారు. అయితే రాను రానూ పరిషితి మారుతుందని అంటున్నారు. తెలుగుదేశాన్ని తెలంగాణాలో చంద్రబాబు పటిష్టం చేయడం ద్వారా బీజేపీని ఆకర్షిస్తారని, ఎన్నికల వేళకు అక్కడ పొత్తులు కుదిరితే ఏపీలో కూడా ఆ పొత్తులే కొనసాగుతాయని అంటున్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.