Begin typing your search above and press return to search.

సెక్షన్ 8 పెట్టాలంటున్న టీ విపక్షాలు

By:  Tupaki Desk   |   3 Feb 2016 4:32 PM GMT
సెక్షన్ 8 పెట్టాలంటున్న టీ విపక్షాలు
X
సెక్షన్ 8 మాట ఎత్తితే చాలు.. అంతెత్తు ఎగిరిపడటం తెలంగాణ అధికారపక్షానికి మామూలే. సెక్షన్ 8 అన్న మాట వినిపించినంతనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే విపరీతమైన ఆవేశానికి గురి అవుతారు. హైదరాబాద్ కు ఏమైంది? శాంతిభద్రతల్ని బ్రహ్మాండంగా కాపాడుతున్నాం. తెలంగాణ వస్తే సీమాంధ్ర ప్రాంతాల వారి మీద దాడులు జరుగుతాయని చాలామంది దర్మార్గపు ప్రచారం చేశారని.. గడిచిన 21 నెలల్లో అలాంటిదేమైనా జరిగిందా? అని నిలదీస్తారు.

అయితే.. ఇకపై అలా మాట్లాడే అవకాశం కేసీఆర్ కు మిస్ అయ్యిందనే చెప్పాలి. సీమాంధ్రుల సంగతి తర్వాత.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఉప ముఖ్యమంత్రిని వాళ్లింటికే వెళ్లి తోసేయటం.. వాళ్ల అబ్బాయి మీద దాడి చేయటం ఒక ఎత్తు అయితే.. తెలంగాణకాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. టీ మండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీలను కారులో నుంచి బయటకు లాగి మరి దాడి చేయటం లాంటివి చోటు చేసుకొని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో మజ్లిస్ రెచ్చిపోయిన తీరు చూసి ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల వరకూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి.

మజ్లిస్ చేతిలో ఈ రేంజ్ ఎదురుదెబ్బ తొలిసారి తగలటం.. ఇలాంటి గతంలోనూ.. వర్తమానంలో ఎదురైన బీజేపీతో పాటు.. టీడీపీ.. ఉభయ కమ్యూనిస్టులకు మజ్లిస్ కారణంగా చేదు అనుభవాలు ఉన్నాయి. అయితే.. గతంలో ఎప్పుడూ లేనంత బరితెగింపును తాజా గ్రేటర్ ఎన్నికల్లో ప్రదర్శించటం గమనార్హం. వీధి రౌడీలకు మించిన రీతిలో చెలరేగిపోయిన మజ్లిస్ అగ్రనేతలు.. కార్యకర్తలు తీరుపై తెలంగాణ విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా వారో ఆసక్తికర ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.

రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ శాంతిభద్రతల్ని అవసరమైతే గవర్నర్ చేతికి అప్పగించాలన్న ఒక రూల్ ను సెక్షన్ 8 కింద పెట్టటం తెలిసిందే. ఒకవేళ అదే జరిగితే.. రాష్ట్ర ప్రభుత్వానికి శాంతిభద్రతల్ని నియంత్రించే అవకాశం ఉండదు. హైదరాబాద్ లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్న భావన కలిగినప్పుడు సెక్షన్ 8ను అమలు చేసే వీలుంది. తాజాగా మజ్లిస్ రెచ్చిపోవటం.. సొంత పార్టీ నేత మీద దాడి చేసినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ అధికారపక్షంపై తెలంగాణకు చెందిన విపక్షాలు (కాంగ్రెస్.. తెలుగుదేశం.. బీజేపీ.. సీపీఎం.. సీపీఐ) పార్టీలు హైదరాబాద్ లో సెక్షన్ 8 ను అమలు చేయాలంటూ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశాయి.

తప్పు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్న ఒక నిందితుడ్ని.. మజ్లిస్ ఎంపీ దౌర్జన్యంగా విడిపించుకు వెళ్లటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా పేర్కొన్నారు. పాతబస్తీలో చోటు చేసుకున్న ఘటనల్ని తేలిగ్గా తీసుకుంటే.. హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలే మరిన్ని చోటు చేసుకునే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల్ని గవర్నర్ తన అదుపులోకి తీసుకోవాలని.. ఇందుకు సెక్షన్ 8ను అమలు చేయాలంటూ విపక్ష నేతలు మూకుమ్మడిగా డిమాండ్ చేయటం గమనార్హం. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మజ్లిస్ చెలరేగిపోయిన తీరు అందరికి షాకింగ్ మారింది. అయితే.. ఈ వ్యవహారంపై ఆశించినంత మేర తెలంగాణ అధికారపక్షం రియాక్ట్ కాలేదన్న భావన నెలకొంది. అందుకే.. తెలంగాణ విపక్షాలు సెక్షన్ 8ను తెరపైకి తీసుకొచ్చాయి. మరి.. దీనిపై తెలంగాణ అధికారపక్షం ఏ రీతిలో రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.