Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో కాంగ్రెస్‌ లో ఒకేఒక్క‌డి క‌ల్లోలం..!

By:  Tupaki Desk   |   10 Aug 2019 7:04 AM GMT
తెలంగాణ‌లో కాంగ్రెస్‌ లో ఒకేఒక్క‌డి క‌ల్లోలం..!
X
తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఆ పార్టీ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌ లోకి వెళ్లిపోయారు. ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే భ‌విష్య‌త్తులో టీ కాంగ్రెస్‌ లో ఒక‌రిద్ద‌రు నేత‌లు త‌ప్పా మిగిలిన కీల‌క నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఎవ్వ‌రూ మిగిలే ప‌రిస్థితి లేదు. మ‌రోప‌క్క బీజేపీ ఇక్క‌డ కాంగ్రెస్‌ ను బొంద పెట్టేందుకు కాచుకుని కూర్చొని ఉంది. ఇక మిగిలిన వాళ్ల సంగ‌తి ఎలా ఉన్నా రాజీవ్ కుటుంబానికి వీర విధేయుడు అయిన వీహెచ్ లాంటి వాళ్లే ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారంటే ఇక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇక్క‌డ పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతున్నా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఇంత‌లా దిగ‌జారిపోవ‌డానికి ఒక‌రిద్ద‌రు స్థానిక నేత‌ల‌తో పాటు రాహుల్ కోట‌రీలో కీల‌క నేత‌గా ఉన్న కొప్పుల రాజు ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్న ఆగ్రహం అక్క‌డ పార్టీ నేత‌ల్లో ఉంది. గ‌తంలో కొప్పుల రాజు వైఖ‌రిపై మాజీ మంత్రి రేణుకా చౌద‌రి తీవ్రంగా ఫైర్ అయ్యారు. క‌నీసం రాహుల్ అప్పాయింట్‌ మెంట్ కూడా రాకుండా రాజు అడ్డుప‌డ్డార‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇక ఇప్పుడు వీహెచ్ సైతం రాజు తీరుపై మండిప‌డుతున్నారు. ఇక ఇప్పుడు వీహెచ్ సైతం తెలంగాణ కాంగ్రెస్‌ లో జ‌రుగుతున్న ప‌రిణామాలేవి రాహుల్‌ కు తెలియ‌కుండా అడ్డుకుంటున్నార‌ని ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇక కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అయితే రాజు విష‌యంలో ఎప్ప‌టి నుంచో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చివ‌ర‌కు వీరు ఎప్పుడైనా పార్టీ వీడే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లిపోయింది. రాజు తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల‌ను వ‌దిలేస్తేనే ఇక్క‌డ పార్టీ బాగుప‌డుతుంద‌ని టీ కాంగ్రెస్ వాళ్లు భావిస్తున్నారు. ఈ ఒకే ఒక్క నేత వ‌ల్లే పార్టీలో ఇక్క‌డ జ‌రుగుతున్న విష‌యం రాహుల్‌ కు తెలియ‌డం లేద‌ని చాలా మంది భావిస్తున్నారు.

ఓ వైపు బీజేపి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ లో భాగంగా కాంగ్రేస్ నేత‌ల‌ను టార్గెట్ చేస్తుంటే… కాంగ్రెస్ నేతలు మాత్రం ఉన్న వారిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇక టీఆర్ ఎస్ పార్టీని ఇప్ప‌టికే నాశ‌నం చేయాల్సినంత చేసేసింది. పార్టీలో దిగ్గ‌జ నేత‌లు బ‌య‌ట‌కు పోతున్నారు. కొత్త నేత‌లు, యువ నేత‌లు అస్స‌లు పార్టీ వైపే చూడ‌డం లేదు. యువ‌కులు కాంగ్ర‌స్సో, బీజేపీ వైపో వెళుతున్నారే త‌ప్పా కాంగ్రెస్ వైపు ఎవ్వ‌రూ చూడ‌డం లేదు. మ‌రి ఇప్ప‌ట‌కి అయినా రాహుల్ టీ కాంగ్రెస్‌ ను ప్రక్షాళ‌న చేసి పున‌ర్వైభ‌వం తీసుకు వ‌స్తారేమో ? చూడాలి.