Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాల ఏర్పాటులో సరికొత్త లొల్లి

By:  Tupaki Desk   |   14 Aug 2016 4:46 AM GMT
కొత్త జిల్లాల ఏర్పాటులో సరికొత్త లొల్లి
X
దసరా నాటికి తెలంగాణ రాష్ట్రంలో కొత్తజిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్.. అందులో భాగంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన అన్ని పనులను 360 డిగ్రీల్లో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్న ఆయనకు అనుకోని పరిణామాలు తెర మీదకు వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన పంచాయితీ ఒక కొలిక్కి రాలేదు. కొత్త జిల్లాలపై డిమాండ్లు ఒక పక్క వినిపిస్తున్నా.. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పందన ఏమిటన్నది ఇంకా స్పష్టత రాని పరిస్థితి. ఇప్పటికైతే 14 జిల్లాలతో కూడిన జాబితాను ప్రభుత్వం బయటకు తీసుకొచ్చింది. దీనిపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలపై ఏం చేస్తారన్నది ఇంకా కొలిక్కి రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంలో నేతల మధ్య పేచీ పంతాల వరకూ వెళ్లటం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాల మధ్య కొత్త పేచీ తెర మీదకు వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా జిల్లాల పునర్విభజనపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన పరిస్థితి. రంగారెడ్డి జిల్లాల నేతలు తమ జిల్లాలోని ప్రాంతాల్ని హైదరాబాద్ లో కలపటాన్ని పార్టీలకు అతీతంగా వ్యతిరేకించింది. ఇదెంత తీవ్రంగా ఉందంటే.. హైదరాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో తాము కలిసి కూర్చోవటం ఇష్టం లేదంటూ బయటకు వెళ్లిపోయారు.

దీంతో.. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం హైదరాబాద్.. రంగారెడ్డి జిల్లాల నేతలతో విడిగా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాను రెండు.. మూడు జిల్లాలుగా విడగొట్టాలే కానీ.. హైదరాబాద్ లో కలపటం సరికాదంటూ మంత్రి మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు సమర్థించటం గమనార్హం. మరోవైపు.. హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి జిల్లా ఉండటం అశాస్త్రీయమని మజ్లిస్ ఎమ్మెల్యేలు వాదించారు. ఇదిలా ఉంటే.. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లను జిల్లాలతో సంబంధం లేకుండా.. హైదరాబాద్ జిల్లా కిందకు తేవాలన్న ఆలోచన చేశారు. ఇదిలా ఉంటే.. జిల్లాల విషయంలో తమ అభిప్రాయం తీసుకోవటం లేదంటూ కిషన్ రెడ్డి అండ్ కో సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోవటం గమనార్హం. కొత్త జిల్లాల ఏర్పాటు ఏమో కానీ.. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వస్తున్న సరికొత్త పంచాయితీలు తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకురావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.