Begin typing your search above and press return to search.

వేస‌వి కాలం.. పాద‌యాత్ర‌ల సీజ‌న్‌

By:  Tupaki Desk   |   16 April 2022 12:30 PM GMT
వేస‌వి కాలం.. పాద‌యాత్ర‌ల సీజ‌న్‌
X
అస‌లే భ‌గ‌భ‌గ‌మంటున్న సూర్యుడు.. మండుతున్న ఎండ‌లు.. పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు.. అలాంటి ఈ వేస‌విలో రాజకీయ వేడిని మ‌రింత పెంచేందుకు పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. తెలంగాణ‌లో మండే ఎండ‌ల్లో నాయ‌కుల పాద‌యాత్ర పొలిటిక‌ల్ హీట్ పెంచుతోంది.

ఒకే స‌మ‌యంలో నాలుగు పార్టీల‌కు చెందిన నేత‌లు యాత్ర‌లు చేస్తుండ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రెండో ద‌శ ప్ర‌జా సంగ్రామ యాత్ర మొద‌లెట్టారు. తెలంగాణ‌లో పాగా వేయాల‌ని చూస్తున్న ఆప్ పాద‌యాత్ర షురూ చేసింది. ఇప్ప‌టికే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల‌, బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ సాగుతున్నారు.

రెండో విడ‌త యాత్ర‌లు..

తెలంగాణ‌లో పుంజుకుంటున్న బీజేపీ ప్ర‌జ‌ల‌తో క‌లిసి మ‌రింత బ‌లోపేతమ‌వ‌డంపై దృష్టి సారించింది. అందుకే గ‌తేడాది ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర మొద‌లెట్టారు. 36 రోజుల పాటు తొలి ద‌శ పాద‌యాత్ర సాగింది. ఆ త‌ర్వాత ఈ నెల 14న ఆయ‌న రెండో ద‌శ ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు శ్రీకారం చుట్టారు.

31 రోజుల పాటు ఈ రెండో విడ‌త పాద‌యాత్ర సాగుతుంది. సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే టార్గెట్‌గా ఆయ‌న అడుగులు సాగుతున్నాయి. ఇక తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తేవ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన ష‌ర్మిల ప్ర‌జా ప్ర‌స్థాన యాత్ర‌ను తిరిగి కొన‌సాగిస్తున్నారు. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా మ‌ధ్య‌తో ఆమె పాద‌యాత్ర‌కు విరామం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

రాజ్యాధికారం కోసం..

బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా త‌న ఐపీఎస్ ప‌ద‌వికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ప్ర‌స్తుతం బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ రాష్ట్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కొన‌సాగుతున్న ఆయ‌న‌.. బ‌హుజ‌న రాజ్యాధికార యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగేస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఇటు టీఆర్ఎస్‌ను, అటు బీజేపీని విమ‌ర్శిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విష‌యంపై ఈ రెండు పార్టీలు నాట‌కాలు ఆడుతున్నాయంటూ మండిప‌డుతున్నారు. ఇక పంజాబ్ ఎన్నిక‌ల్లో విజ‌యంతో జోరు మీదున్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఇక్క‌డ ప‌ట్టు సాధించ‌డం కోసం మ‌హా పాద‌యాత్ర‌కు అంబేడ్క‌ర్ జ‌యంతి రోజు శ్రీకారం చుట్టింది