Begin typing your search above and press return to search.

ఏపీ మందు బాబులకు తెలంగాణ కిక్కు

By:  Tupaki Desk   |   1 Dec 2019 9:29 AM GMT
ఏపీ మందు బాబులకు తెలంగాణ కిక్కు
X
ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు.. పైగా రాత్రి 8 గంటల వరకే మద్యం షాపులు కట్టేయడంతో మందుబాబులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పైగా పేరున్న ప్రముఖ బ్రాండ్లు ఏపీలోని సర్కారు మద్యం షాపుల్లో దొరకడం లేదు. దీంతో కొందరు మద్యం ప్రియులు కొత్త దందా మొదలుపెట్టారు.

తెలంగాణ సరిహద్దున గల వైన్స్ నుంచి భారీగా ఏపీ వాసులు మద్యం కొనుగోలు చేసి గుట్టు చప్పుడు కాకుండా ఏపీకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రూ.25 నుంచి రూ.100 వరకూ తెలంగాణకు ఏపీకి ధరల మధ్య తేడాలు ఉండడంతో ఇక్కడి నుంచి తరలిస్తూ లాభాల పంట పండిస్తున్నారట.. సరిహద్దు గ్రామాలకు పెద్ద ఎత్తున తెలంగాణ మద్యం సరఫరా అవుతోందట.. తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోనే ఏకంగా అక్రమమద్యం కేసులు 61 నమోదయ్యాయి. 80మందిని అరెస్ట్ చేశారు.

ఏపీలో మద్యం ధరలు పెరగడం పేద, మధ్యతరగతి వారికి భారంగా మారింది. ఎంత ధరకైనా కొనడానికి వెనుకాడకపోవడంతో రోజు వారిగా పనిచేసిన కూలీలు సంపాదనను మద్యానికే తగలేస్తున్నారు.

ఏపీతో పోలిస్తే చీప్ గా దొరికే తెలంగాణ మద్యంను ఇప్పుడు విచ్చలవిడిగా కొనుగోలు చేసి ఏపీలోని ధరలకే అమ్ముకుంటున్నారు. తద్వారా వ్యాపారులు - బెల్ట్ షాపుల వారు లాభాలు గడిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పల్నాడు వాసులు ఎక్కువగా మద్యాన్ని తెలంగాణ నుంచి పల్నాడుకు తరలిస్తున్నారు. అటు ఖమ్మం నుంచి మహబూబ్ నగర్ వరకూ తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మార్గాల్లో ఏపికి మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. తద్వారా ఏపీ ఖాజానకు గండిపడుతుండగా.. తెలంగాణ ఎక్సైజ్ శాఖ పంట పండుతోంది.