Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా ఎఫెక్ట్.. గల్ఫ్ జైల్లో యువకుడు

By:  Tupaki Desk   |   6 Feb 2019 10:50 AM GMT
సోషల్ మీడియా ఎఫెక్ట్.. గల్ఫ్ జైల్లో యువకుడు
X
ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన నిజామాబాద్ యువకుడు తెలిసి తెలియక చేసిన తప్పుకు ఇప్పుడు అక్కడి జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. సోషల్ మీడియా వల్ల చిక్కుల్లో పడ్డాడు. నిజామాబాద్ జిల్లాకు పెర్కిట్ గ్రామానికి చెందిన చెన్న రాకేష్ 2017లో ట్విట్టర్ లో పెట్టిన పోస్టు అతడికి శిక్ష పడేలా చేసింది. మయన్మార్ రోహింగ్యాలపై దమనకాండను సమర్థిస్తూ రాకేష్ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు. కొందరు దీన్ని సమర్ధిస్తూ రీట్వీట్ లు చేశారు. ఇది పెద్ద వివాదంగా మారింది. ఓ వర్గం వారు ఆ ట్వీట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించిన కోర్టు రాకేష్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఈ నిజామాబాద్ యువకుడు రియాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

2017లో రాకేష్ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు. అది వివాదం కావడంతో దాన్ని వెంటనే తొలగించాడు. కానీ అప్పటికే అది వైరల్ గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

గల్ఫ్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. సోషల్ మీడియాలో మతపరమైన పోస్టులు తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు ఒప్పుకుంటే స్వల్ప శిక్ష పడుతుంది. అదే వివాదాస్పద పోస్టులు పెడితే మాత్రం కఠిన శిక్షలు విధిస్తారు. రాకేష్ కు ఐదేళ్ల శిక్ష పడగా.. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునే గడువును కోర్టు ఇచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల అతడు చేసుకోలేకపోతున్నాడు. రాకేష్ కు ఎవరైనా దాతలు సాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రముఖులను కోరుతున్నారు.