Begin typing your search above and press return to search.

అమరుల స్తూపం మూడు ముక్కలైంది

By:  Tupaki Desk   |   25 Jun 2016 4:27 AM GMT
అమరుల స్తూపం మూడు ముక్కలైంది
X
తెలంగాణ అమరవీరుల త్యాగాల్ని గుర్తు చేసుకునేందుకు ఏర్పాటు చేయాలని భావించిన అమరవీరుల స్తూపం మూడు ముక్కలైంది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయదలిచిన ఈ స్తూపం ఇలా ముక్కలు కావటానికి నిర్లక్ష్యమే కారణంగా తప్పు పడుతున్నారు. ప్రజల భావోద్వేగాల్ని ప్రభావితం చేసే అంశంపట్ల అధికారుల నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

అమరుల త్యాగాల్ని గుర్తు చేసుకోవటానికి వీలుగా 40 అడుగుల ఎత్తున్న ఏక శిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.28 లక్షలు కేటాయించారు. స్తూపం కోసమే రూ.10 లక్షలు ఖర్చు చేసి.. ప్రత్యేకంగా శిల్పుల్ని తెప్పించి తయారు చేయించారు. తాజాగా రూపొందించిన స్తూపాన్ని నిలబెట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అయితే.. దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు.. స్తూపాన్ని నిలబెట్టే సమయంలో అక్కడ లేకపోవటం.. స్తూపాన్ని పైకి లేపి.. నిలువుగా నిలబెట్టే సమయంలో క్రేన్ వైరు తెగిపడటంతో స్తూపం మూడు ముక్కలైంది.

ఈ విషయం తెలుసుకున్న మంత్రులు హుటాహుటిన స్తూపం విరిగిన ప్రాంతానికి వెళ్లి.. పరిస్థితిని సమీక్షించారు. విరిగిపోయిన స్తూపం స్థానే.. మరో అద్భుతమైన స్తూపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. అద్భుత స్తూపం ముచ్చట తర్వాత.. ఇప్పుడు చోటు చేసుకున్న నిర్లక్ష్యం మాటేమిటి..?