Begin typing your search above and press return to search.

కేసీఆర్ అంటే మీడియాకు మ‌రీ ఇంత వ‌ణుకా?

By:  Tupaki Desk   |   4 Nov 2017 5:15 AM GMT
కేసీఆర్ అంటే మీడియాకు మ‌రీ ఇంత వ‌ణుకా?
X
నిజ‌మే.. నిండు అసెంబ్లీలో త‌న ఇష్టానికి త‌గ్గ‌ట్లు మాట్లాడితే.. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెప్పాల్సిందెవ‌రు? త‌న ఇష్టానికి త‌గ్గ‌ట్లుగా రాష్ట్రం ఉండాల‌న్న అభిలాష ప్ర‌తి ముఖ్య‌మంత్రికి ఉంటుంది. కానీ.. ప్ర‌జాధ‌నాన్ని అవ‌స‌రం ఉన్నా లేకున్నా ఖ‌ర్చు పెట్టేయ‌టానికి సిద్ధ‌మైతే కంట్రోల్ చేయాల్సిన సామాజిక బాధ్య‌త ఎవ‌రు తీసుకోవాలి? తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఇప్పుడు కొత్త స‌చివాల‌యం క‌ట్టుకోవాల‌నుకుంటున్నారు. దానికి ఆయ‌న చాలానే ముచ్చ‌ట్లు చెబుతున్నారు.
అదేదో ప‌ల్లీ.. బ‌టాణి అన్న‌ట్లుగా రూ.400 కోట్ల ఖ‌ర్చును సింపుల్ గా తేల్చేస్తున్నారు. అదేమంటే.. ధ‌నిక రాష్ట్రం ఆ మాత్రం ఖ‌ర్చు చేయ‌లేని స్థితిలో ఉన్నామా అంటూ సెంటిమెంట్ మాట‌ను సీన్లోకి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా కొత్త స‌చివాల‌యాన్నిక‌ట్టేస్తామంటూ తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్‌. వాస్తు కోసం కాదంటూనే.. చాలా కోణాల్లో అది కూడా ఒక‌టి ఉంద‌న్న విష‌యాన్ని ఆయ‌న దాచ‌లేక‌పోయారు.

ఇరుగ్గా.. వంక‌ర‌టింక‌ర‌ల‌తో ఛండాలంగా ఉన్న స‌చివాల‌యం దేశంలోనే వ‌ర‌స్ట్ అని స‌ర్టిఫికేట్ ఇచ్చేశారు కూడా. ఏదైనా వ‌దిలించుకోవాల‌నుకున్న‌ప్పుడు ప‌నికిరాదు.. వేస్ట్ అన్న ముద్ర‌లు వేయ‌టం మామూలే. అందుకే.. ఇన్నాళ్లు పాల‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన స‌చివాల‌యం వేస్ట్ అయిపోయింది. కేసీఆర్ అభిరుచి ప్ర‌కారం క‌ట్టేదే స‌చివాల‌యం. అందుకోసం వంద‌ల కోట్లు ఖ‌ర్చు అయినా కేసీఆర్ కు అస్స‌లు ప‌ట్ట‌దు. ఆ మాత్రం ఖ‌ర్చు చేయ‌కుండా వ‌స‌తులు ఎలా వ‌స్తాయ‌న్న మాట‌ను చెప్పేస్తారు.

తాను నిర్మించాల‌నుకుంటున్న స‌చివాల‌యానికి ప్లే గ్రౌండ్ ను ఎంపిక చేసుకోవ‌టంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల్ని కొట్టి పారేయ‌ట‌మే కాదు.. అస‌లు ప్లే గ్రౌండ్ లో ఎవ‌రు ఆడుతున్నారంటూ ఎదురుప్ర‌శ్న వేశారు. ముఖ్య‌మంత్రి నోటి నుంచి ఇంత విలువైన మాట వ‌చ్చిన‌ప్పుడు.. అందులో నిజం ఎంత‌న్న విష‌యాన్ని క్రాస్ చెక్ చేసి ప్ర‌జ‌ల ముందు వాస్త‌వాన్ని చూపించాల్సిన క‌నీస బాధ్య‌త‌ను మీడియా వదిలేయ‌టం విషాద‌క‌ర‌మ‌ని చెప్పాలి.

తాను క‌ట్టాల‌ని భావిస్తున్న స‌చివాల‌యానికి ఎంపిక చేసిన చోట్ల అస‌లు ఎవ‌రూ ఆడుకోరంటూ కేసీఆర్ మాష్టారు స‌భ‌లో చెప్పిన త‌ర్వాత‌.. పొద్దున్నే అక్క‌డికి వెళితే పెద్ద ఎత్తున ఆట‌లు ఆడుకోవ‌టం.. వ్యాయామం చేసే వాళ్లు క‌నిపించారు. వీకెండ్స్ లో ఈ జోరు మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌న్న విష‌యాన్ని అక్క‌డి వారు చెప్పారు.

కేసీఆర్ మీద విమ‌ర్శ‌లు చేసేంత ధైర్యం మీడియాకు లేద‌న్న విమ‌ర్శ‌ను ప‌క్క‌న పెడితే.. ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా.. స‌భ‌లో ముఖ్య‌మంత్రి మాట‌ల్ని.. ప‌క్క‌రోజు ఉద‌యం స‌ద‌రు గ్రౌండ్ లో ఉన్న సంద‌డిని క‌లిపి రెండు ఫోటోలుగా ఫ‌స్ట్ పేజీలో వేస్తే స‌రిపోతుంది క‌దా? చాలా చిన్న‌గా క‌నిపించే ఈ ప‌నిని ఏ మీడియా కూడా చేయ‌లేక‌పోయింది. పాల‌కులు తీసుకున్న నిర్ణ‌యాన్ని ఓకే బాస్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే పాత్రికేయం అవుతుందా? ప‌్ర‌జ‌ల సంక్షేమం.. వారి సొమ్మును అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు కాకుండా ఆప‌టం మీడియా బాధ్య‌త కాదా? అన్న సందేహాలకు స‌మాధానం చెప్పే వారే క‌నిపించ‌రు. ఇదంతా చూసిన‌ప్పుడు గ‌డిచిపోయిన రోజులే చాలా మంచివ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కాస్త శ్ర‌మించి గ‌తంలోకి వెళితే.. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న న‌మ్మిన వాస్తుకు త‌గ్గ‌ట్లుగా స‌చివాల‌యం గేట్లు మారిస్తేనే అప్ప‌టి పాత్రికేయం ఎన్టీఆర్ ను చీల్చి చెండాడింది. దీంతో పోల్చిన‌ప్పుడు ఇప్ప‌టి పాత్రికేయం ప‌రిస్థితేమిటో ఎవ‌రికి వారు త‌మ మ‌న‌సుకు స‌మాధానం చెప్పుకుంటే స‌రి.