Begin typing your search above and press return to search.

ఉత్సవ విగ్రహాలుగా మిగిలాం.. ఆ నేతల ఆవేదన

By:  Tupaki Desk   |   2 Oct 2020 5:30 PM GMT
ఉత్సవ విగ్రహాలుగా మిగిలాం.. ఆ నేతల ఆవేదన
X
తెలంగాణలో ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామంటూ ఆ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని రాష్ట్ర ఎంపీటీసీల కార్యవర్గ సమావేశం ధ్వజమెత్తారు.

బాగ్ లింగంపల్లిలో గడీల కుమార్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ ఎంపీటీసీల కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. తెలంగాణలో ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు, విధులు, అధికారాలు కల్పించాలని ఎంపీటీసీలు డిమాండ్ చేశారు.

ఎంపీటీసీలుగా తెలంగాణలో ఎన్నికైన నాటి నుంచి నిధులు కేటాయించకపోవడంతో కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారామని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా మండల పరిషత్ సభ్యుల ప్రమేయం లేకుండానే నేరుగా గ్రామాలకు వస్తుండడంతో ఎంపీటీసీలను ఎవరూ పట్టించుకోవడం లేదని.. గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.వార్డు సభ్యులకు ఉన్నపాటి గౌరవం కూడా ఎంపీటీసీలకు లేదన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి ఎంపీటీసీకి ఏటా రూ.20 లక్షల నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్, అగ్రికల్చర్, మార్కెటింగ్ , మండల ల్యాండ్ అసైన్ మెంట్ కమిటీలు, జిల్లా ప్రణాళిక సంఘాల్లో ఎంపీటీసీలను సభ్యులుగా నియమించాలన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి న్యాయబద్దమైన 33 డిమాండ్లను తీసుకెళ్లాలని నిర్ణయించారు. మంత్రి ఎర్రబెల్లికి రాష్ట్ర ఎంపీటీసీల సంఘం తరుఫున ఈ మేరకు ఈ బాధ్యతను అప్పగించనున్నామని.. ఆయనకు విజ్ఞప్తి చేస్తామన్నారు.