Begin typing your search above and press return to search.

కొత్త కోణం: ‘కొత్త జిల్లాల’కు కొత్త పేర్లు

By:  Tupaki Desk   |   20 Oct 2016 6:27 AM GMT
కొత్త కోణం: ‘కొత్త జిల్లాల’కు కొత్త పేర్లు
X
హడావుడిగా చేసే పనులు ఎలా ఉంటాయనటానికి నిదర్శనంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ముచ్చటను చూస్తే ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. ఏడాదికి పైనే కసరత్తు చేసినట్లు చెప్పుకొన్నా.. చివరి క్షణాల్లో హడావుడి.. హడావుడిగా.. రోజుకో నిర్ణయం అన్నట్లుగా చేసిన దానికి తగినట్లే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త జిల్లాల్లో తాము కోరుకున్నట్లుగా లేవన్న నిరసనలు వినిపించాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమ మండలాలు తాము కోరుకున్నట్లుగా ఏర్పాటు చేయలేదంటూ ఇద్దరు ఆత్మహత్యలు చేసుకోవటం తీవ్ర కలకలంగా మారింది.

ఇదిలా ఉండగా.. కొత్త జిల్లాలకు సంబంధించి పెట్టిన పేర్లపై మరో వివాదం నడుస్తోంది. కొత్త పేర్లు బాగానే ఉన్నా.. అదే ప్రాంతానికి చెందినదన్న గుర్తింపు లేకుండా ఉండటంపై అక్కడి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజన్న పేరిట ఏర్పాటు చేసిన జిల్లాపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ.. జిల్లా సిరిసిల్లకు చెందిందన్న విషయం ఏమాత్రం తెలియని పరిస్థితి. దీంతో.. ఆ జిల్లా వాసులు తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారు. రాజన్న పేరుకు తమకు ఐడెంటిటిగా ఉండే సిరిసిల్ల పేరును జత చేయాలని వారు కోరుతున్నారు.

ఇలాంటి పరిస్థితి ఒక్క రాజన్న జిల్లాకే పరిమితం కాలేదు. జోగులాంబ (గద్వాల).. కొమ్రంభీం (అసిఫాబాద్).. యాదాద్రి (భువనగిరి).. జయశంకర్ (భూపాలపల్లి).. భద్రాద్రి(భువనగిరి) జిల్లాలకు ఉంది. దీంతో..ఈ జిల్లాల పేర్లను మార్చాలని.. ఇప్పుడున్న పేర్లకు.. ఆ జిల్లాలో సుపరిచితమైన జిల్లా కేంద్రాల్ని జత చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే యాదాద్రిని.. యాదాద్రి భువనగిరిగా మారుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన జిల్లాల పేర్లను కూడా మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఎంతో కసరత్తు చేసిన తర్వాతే కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లా స్వరూపం తర్వాత సంగతి.. జిల్లా పేర్లనే సక్కగా పెట్టని వైనం చూస్తేనే.. జిల్లాల ఏర్పాటు కార్యక్రమం ఎంత సోకుగా సాగిందో అర్థమయ్యే పరిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/