Begin typing your search above and press return to search.

తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు

By:  Tupaki Desk   |   22 Aug 2016 9:50 AM GMT
తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు
X
తెలంగాణ జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తొమ్మిది జిల్లాలకు విడివిడిగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మార్గదర్శకాలకు జీవో 194ను ప్రభుత్వం విడుదల చేసింది. పునర్‌ వ్యవస్థీకరణపై నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కలెక్టరేట్లు - సీసీఎల్‌ ఏలో అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ముసాయిదా ఆర్డరును తెలంగాణ ప్రభుత్వ goir.telanga.gov.in వెబ్ సైట్లో ఉంచారు. ఈ నోటిఫికేషన్ ను సమాచార శాఖ పత్రికలకు ప్రకటన వెలువరిస్తుంది. జిల్లా స్థాయిలో మంగళవారంనుంచి కలెక్టర్ - జెడ్పీ - సబ్ కలెక్టర్ - ఆర్డీవో - ఎమ్మార్వో - ఎండీవో - గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నోటిఫికేషన్ ప్రదర్శిస్తారు. రాష్ర్ట విభజన తరువాత ఏపీ - తెలంగాణల్లో కొత్త జిల్లాలు ఏర్పడనుండడం ఇదే ప్రథమం.

కొత్తగా 17 జిల్లాలు ఏర్పటవుతున్నాయి. దీంతో మొత్తం జిల్లాలు 27 కానున్నాయి. 31 మండలాలు - 14 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పటవుతున్నాయి. దీంతో 58 రెవెన్యూ డివిజన్లవుతాయి. 9 జిల్లాలకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చారు. అన్నీ పూర్తయ్యాక దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు - 44 రెవెన్యూ డివిజన్లు - 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు - 58 రెవెన్యూ డివిజన్లు - 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ఊపందుకోనుంది.

కాగా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల కాగానే కొత్త జిల్లాల్లో పెద్దఎత్తున సంబరాలు మొదలయ్యాయి. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి మాదిరిగా పలు చోట్ల ప్రజలు - టీఆరెస్ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు.