Begin typing your search above and press return to search.

లింగాకారంలో తెలంగాణ సెక్రటేరియట్

By:  Tupaki Desk   |   7 July 2016 6:37 AM GMT
లింగాకారంలో తెలంగాణ సెక్రటేరియట్
X
తెలంగాణలో ఏర్పాటుకానున్న కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కావడంతో పాటు కొత్త సచివాలయ నిర్మాణానికీ కేసీఆర్ ప్రభుత్వం త్వరలో ముహూర్తం పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ కుదిరితే దసరాయే ఆ శుభముహూర్తం అని వినిపిస్తోంది. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు ఈ దసరాకు శంకుస్థాపన చేసి 2017 దసరా నాటికి కొత్త సచివాలయ భవనంలోకి ప్రవేశించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దేశ రాజధానిలో కేంద్ర సచివాలయం తరహాలో రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కాగా ఈ సెక్రటేరియట్ లింగాకారంలో ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఏపీ నూతన రాజధానిలో నిర్మాణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ సంస్థలతో డిజైన్లు చేయిస్తున్నా తెలంగాణలో కేసీఆర్ మాత్రం స్వదేశీ అర్కిటెక్టులపై నమ్మకం ఉంచారు. ముంబయికి చెందిన ప్రసిద్ధ ఆర్కిటెక్టు హఫీజు కాంట్రాక్టర్ కు తెలంగాణ నూతన సచివాలయ డిజైనింగ్ బాధ్యతలు అప్పగించారు. హఫీజ్ నుంచి కేసీఆర్ కు ఇప్పటికే డిజైన్ అందిందని.. దాన్ని ఆయన దాదాపు ఖాయం చేసినట్టు అధికార వర్గాల సమాచారం. వాస్తు పండితుల సలహాలతో హఫీజు రూపొందించిన డిజైన్‌లో స్వల్ప చేర్పులు - మార్పులు చేసి దానినే సిఎం కెసిఆర్ ఖాయం చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఆగస్టు నెలాఖరులో పాత సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం కానున్నాయని అంటున్నారు. హుస్సేన్‌ సాగర్ లేక్‌ వ్యూ ఎలివేషన్‌ తో కొత్త సచివాలయాన్ని వాస్తుకు అనుగుణంగా ‘యు’ అక్షరం నమునాతో నిర్మించేలా డిజైన్ చేశారు. ఓ వైపు నుంచి ఇది లింగాకారంలో ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిఎం కార్యాలయానికి (సమతా బ్లాక్) రెండు వైపుల రెండేసి బ్లాక్‌ లను (నాలుగు బ్లాక్‌ లు) ఐదు అంతస్తులతో నిర్మించి వీటికి మధ్య చివర పడమర వైపున ప్రస్తుత సిఎంఓ (చీఫ్ మినిష్టర్ ఆఫీస్) స్థానంలోనే తిరిగి సిఎం కార్యాలయాన్ని నిర్మించేలా డిజైన్‌ ను రూపొందించారు. రెండువైపుల నిర్మించే రెండేసి భవనాలు ఐదేసి అంతస్తులతో - సిఎం కార్యాలయం మాత్రం ఆరు అంతస్తులు (సిఎం కెసిఆర్ లక్కి నంబర్) నిర్మించేలా డిజైన్‌ లో స్వల్ప మార్పులు సూచించినట్టు తెలిసింది. చుట్టూ నిర్మించే నాలుగు బ్లాక్‌ లకు తెలంగాణ సంస్కృతిని ప్రతిభింభించేలా కాకతి - రుద్రమ - చార్మినార్ - గొల్కొండ వంటి చారిత్రక పేర్లు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం సచివాలయంలో ఉన్న నల్ల పోచమ్మగుడి - మసీదుతో పాటు కొత్తగా చర్చి - గురుద్వార్‌ తో ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.