Begin typing your search above and press return to search.

'తెలంగాణ నాట్ ఫర్ సేల్'.. ఇప్పుడిదే ట్రెండింగ్

By:  Tupaki Desk   |   27 Oct 2022 8:30 AM GMT
తెలంగాణ నాట్ ఫర్ సేల్.. ఇప్పుడిదే ట్రెండింగ్
X
మునుగోడు ఉప ఎన్నికల వేళ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుమాల్ చేస్తూ ముగ్గురు అడ్డంగా దొరికారు. బీజేపీకి సన్నిహితులైన వీరిని తెలంగాణ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.100 కోట్ల చొప్పున కొనుగోలు యత్నం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. జాతీయ మీడియా ఈ ఎపిసోడ్‌ను విస్తృతంగా కవర్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఇది బిజెపికి చాలా నష్టం కలిగిస్తోంది. అయినప్పటికీ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడంలో తమకు ఎక్కడా ప్రమేయం లేదని బీజేపీ పార్టీ వెనకేసుకు వస్తోంది.

అయితే, ఈ ఎపిసోడ్‌లో టీఆర్ఎస్ పైచేయి సాధించింది. టీఆర్ఎస్ ఐటీ సెల్ బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అద్భుతమైన వ్యతిరేక ప్రచారం చేస్తోంది. టీఆర్ఎస్ మద్దతుదారులు #TelanganaNotForSale అనే హ్యాష్‌ట్యాగ్‌ను విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. బిజెపిపై తమ అభిప్రాయాలు, విమర్శలను కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు 'తెలంగాణ నాట్ ఫర్ సేల్' హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది.

ఇది కర్నాటక, గోవా కాదని, ఇది కేసీఆర్‌ డెన్‌ అని, కేసీఆర్‌ రాజకీయాలను బీజేపీ తట్టుకోలేకపోతుందని కొందరు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు కామెంట్స్ చేస్తున్నారు. రూ.100 కోట్లకు ప్రలోభాలకు లోనుకాని నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిని చూసి టీఆర్ ఎస్ మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఎపిసోడ్‌పై మీమ్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ మద్దతుదారులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ట్రోల్ చేస్తున్నారు. 'లావాదేవీ విఫలమైంది' అని అమిత్ షా మీమ్ వైరల్ అవుతోంది. టిఆర్‌ఎస్ మద్దతుదారులు వైరల్ చేస్తున్న ఈ మీమ్‌లు బీజేపీ పరువు తీసేలా ఉన్నాయి. ఇక గతంలో గుర్రపు పందాలపై జీఎస్టీ సందర్భంగా ప్రకటిస్తూ తడబడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వీడియోను ఈ మొయినాబాద్ ఫాంహౌస్ కు లింక్ చేసి విమర్శలు చేస్తున్నారు.

ఇందుకు విరుద్ధంగా బీజేపీ ఐటీ సెల్ సైలెంట్ అయిపోయింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీకి సోషల్ మీడియా సైన్యం చాలా ఎక్కువ. కానీ ఈ ఎపిసోడ్‌లో టీఆర్‌ఎస్ ప్రచారాన్ని ఎదుర్కోలేక బీజేపీ వెనుకంజ వేస్తోందని చెప్పొచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.