Begin typing your search above and press return to search.

బాహుబ‌లి లేడు.. అంద‌రూ సైనికులేన‌ట‌

By:  Tupaki Desk   |   12 Aug 2017 6:06 AM GMT
బాహుబ‌లి లేడు.. అంద‌రూ సైనికులేన‌ట‌
X
ఏ ముహుర్తంలో బాహుబ‌లి మొద‌లైందో కానీ.. ఇప్పుడా పేరు ఒక బ్రాండ్ గా మార‌ట‌మే కాదు.. కీల‌క‌మైన రాజ‌కీయ ఇంట‌ర్వ్యూల‌లోనూ ఆ పాత్ర ప్ర‌స్తావ‌న తేకుండా ఉండ‌ని ప‌రిస్థితి. త‌మ బ‌లాన్ని చెప్పుకునేందుకు బాహుబ‌లి పేరును చెప్పుకోవ‌టం రాజ‌కీయ‌పార్టీల‌కు అల‌వాటుగా మారింది. ఇప్ప‌టికే త‌మ పార్టీకి బాహుబ‌లి అంటూ కేసీఆర్ గురించి గులాబీ నేత‌లు గొప్ప‌గా చెప్పుకోవ‌టం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ బాహుబ‌లి గురించి మాత్రం బ‌య‌ట‌కు చెప్పేందుకు ఆ పార్టీ నేత‌లు సిద్ధంగా లేరు.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యానికి త‌మ పార్టీ బాహుబ‌లి రంగంలోకి వ‌స్తారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు త‌ర‌చూ వ్యాఖ్య‌లు చేయ‌టం క‌నిపిస్తుంది. అయితే.. ఆ మాట‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌న్న విష‌యం తాజాగా తేలిపోయింది. కాంగ్రెస్ త‌ర‌ఫున ఎన్నిక‌ల యుద్ధం చేసే వారిలో బాహుబ‌లి ఉండ‌ర‌ని.. అంద‌రూ క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన సైనికులేన‌ని కాంగ్రెస్ చెబుతోంది.

ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాలు చూసుకునేందుకు అధినాయ‌త‌క్వం డిగ్గీరాజా నుంచి బాధ్య‌త‌ల్ని లాగేసుకొని కుంతియాకు ఇవ్వటం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలుగు మీడియాతో ఆయ‌న ప్ర‌త్యేకంగా మాట్లాడారు. 2019లో త‌మ పార్టీ విజ‌యం సాధించ‌టం ఖాయ‌మ‌న్న ధీమాను వ్య‌క్తం చేశారు. అదెలా అంటే.. తెలంగాణ‌లో త‌మ పార్టీకి ఉన్న ఇమేజ్ గా ఆయ‌న చెబుతున్నారు. అస‌లు తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేర‌కు ఇచ్చింది సోనియాగాంధీనే అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దని చెబుతున్నారు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కార‌మే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చార‌ని.. కానీ.. వేరే వాళ్లు దాన్ని త‌మ ఖాతాలో వేసుకున్న‌ట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే రానున్న ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్ర సాద‌న వ్య‌వ‌హారాన్ని వేరే వాళ్లు త‌మ ఖాతాలో వేసుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని.. ఇందుకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేత‌లు బాగా ప‌ని చేస్తున్న‌ట్లు కుంతియా వెల్ల‌డించారు. తామిప్పుడు మంచి ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. 2019 ఎన్నిక‌ల్లో తాము ఎలా వెళ్లాలి? రాష్ట్రంలో ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయ‌న్న అంశంపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. అంద‌రితో మాట్లాడిన త‌ర్వాతే ఎన్నిక‌ల వ్యూహాన్ని సిద్ధం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సీట్ల పెంపు విష‌యంలో చ‌ట్ట‌ప్ర‌కారంగా జ‌రిగే వాటికి తాము క‌ట్టుబ‌డి ఉంటామ‌న్నారు. అధికార దాహంతో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా సీట్లు పెంచ‌టానికి త‌మ పార్టీ అంగీక‌రించ‌ద‌న్నారు. రాష్ట్రంలో రెవెన్యూ జిల్లాల సంఖ్య‌పెరిగినా.. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంప్ర‌కారం మాత్రం తెలంగాణ‌లో ప‌ది జిల్లాలే ఉన్నాయ‌న్నారు.

ఏఐసీసీ త‌ర్వాతి స‌మావేశంలో పెంచిన జిల్లాల్ని ఆమోదించిన త‌ర్వాత జిల్లాల వారీగా క‌మిటీల ఏర్పాటు ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. బాహుబ‌లి లేకుండా ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతామ‌ని చెబుతున్న కాంగ్రెస్ మాట‌లు వింటే.. వాస్త‌వానికి ఊహ‌కు మ‌ధ్య ఉన్న అడ్డుగోడ‌ల్ని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఇంకా బ‌ద్ధ‌లు కొట్ట‌లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.