Begin typing your search above and press return to search.

నిధులు రావాల‌న్నా.. సారు బ‌య‌ట‌కు రావాల‌న్నా.. ఉప ఎన్నిక‌లు రావాలి

By:  Tupaki Desk   |   28 Aug 2021 7:50 AM GMT
నిధులు రావాల‌న్నా.. సారు బ‌య‌ట‌కు రావాల‌న్నా.. ఉప ఎన్నిక‌లు రావాలి
X
తెలంగాణ‌లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి జ‌ర‌గాల‌న్నా.. వాటికి నిధులు అందాల‌న్నా.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు చేరువ కావాల‌న్నా.. స్థానిక నేత‌ల‌కు మంచి ప‌దవులు ద‌క్కాల‌న్నా.. ప్ర‌గ‌తిభ‌వ‌న్ దాటి కేసీఆర్ బ‌య‌ట‌కు రావాల‌న్నా.. ఉన ఎన్నిక‌లు రావాల్సిందే.. ఇదీ ఇప్పుడు తెలంగాణ‌లోని ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకుపోయిన అభిప్రాయం. కేవ‌లం ఎన్నిక‌ల స‌మ‌యంలోనే సీఏం కేసీఆర్ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి నిధుల వ‌ర్షం కురిపించ‌డంతో పాటు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమలు చేస్తున్నార‌ని విజ‌యం కోసం త‌ప‌న ప‌డుతున్నారు త‌ప్ప ప్ర‌జ‌ల గురించి ఆలోచించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌తిప‌క్షాలు కూడా ఇదే అంశంపై అధికార ప్ర‌భుత్వంపై ప‌దునైన విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసం శాయాశక్తులా అన్న ర‌కాలుగా కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని మొద‌ట‌గా ప్ర‌యోగాత్మ‌కంగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్రారంభించ‌డంతో పాటు అందుకు కావాల్సిన నిధుల‌ను విడుదల చేశారు. ఇక ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌నూ ప‌రుగులు పెట్టిస్తున్నారు. రోడ్ల నిర్మాణం స‌హా ఎప్ప‌టినుంచో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఇప్పుడు ప‌రిష్క‌రిస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌ని టీఆర్ఎస్ బ‌య‌ట‌కు చెప్తున్న‌ప్ప‌టికీ అక్క‌డ చేస్తున్న ఈ అభివృద్ధి ప‌నులు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు ఈ ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసమే చేస్తున్నావ‌నే సంగ‌తి గ్ర‌హించ‌ని ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు లేర‌నే అభిప్రాయాలు వినబ‌డుతున్నాయి.

ఇక 2014లో తొలిసారి అధికారం చేప్ప‌టిన త‌ర్వాత ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను త‌న అడ్డాగా మార్చుకున్న కేసీఆర్‌.. అస‌లు సెక్రెటేరియ‌ట్‌కే రాలేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడికి పాత స‌చివాల‌యాన్ని కూల‌గొట్టి అక్క‌డ కొత్త సెక్రెటేరియ‌ట్ నిర్మిస్తున్నారు. ఇక ఎప్ప‌టినుంచో ప్రగ‌తిభ‌వ‌న్ త‌న ఫాంహౌస్ త‌ప్పితే బ‌య‌ట‌కు రాడ‌నే విమర్శ‌లు కేసీఆర్‌పై ఉన్నాయి. క్షేత్ర‌స్థాయిలో ఉంటూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోలేని ముఖ్య‌మంత్రి వాటిని ఎలా ప‌రిష్కారిస్తార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈట‌ల రాజేంద‌ర్ దెబ్బ‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్య‌మా అని కేసీఆర్ జ‌నం బాట ప‌ట్టారు. ఆయా జిల్లాల్లో కొత్త క‌లెక్ట‌రేట్ల ప్రారంభోత్స‌వాల‌కు వెళ్లిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత ద‌ళిత‌బంధు ప‌థ‌కం ప్రారంభోత్స‌వ స‌భ‌లో పాల్గొన్నారు. క‌రీంన‌గ‌ర్‌లో ఈ ప‌థ‌క స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

హుజూరాబాద్‌లో ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్‌.. అక్క‌డి అన్ని సామాజిక వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే ఉద్దేశంతో సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకుని స్థానిక నేత‌ల‌కు వివిధ ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నారు. ఎమ్మెల్సీతో పాటు వివిధ కార్పోరేష‌న్ల‌లో కీల‌క ప‌ద‌వులు ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లోని నేత‌ల‌కే ఇస్తున్నారు. ఇలా ఈ ఉప ఎన్నిక వ‌ల్ల కేసీఆర్ ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తున్నార‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.