Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ చలానాలకు తెలంగాణ ప్రజలు లైట్ తీసుకుంటున్నారా?

By:  Tupaki Desk   |   26 Dec 2019 4:28 AM GMT
ట్రాఫిక్ చలానాలకు తెలంగాణ ప్రజలు లైట్ తీసుకుంటున్నారా?
X
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ చలానాల్ని లైట్ తీసుకుంటున్నారా? అంటే అవునన్న వాదనను వినిపిస్తున్నారు. తాజాగా విడుదలైన గణాంకాల్ని చూస్తే ఈ వాదనలో నిజం ఉందన్న భావన కలుగక మానదు. ట్రాఫిక్ పోలీసులు బాదేసే చలానాల్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవటం లేదన్నట్లుగా అంకెల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. పదకొండు నెలల కాలానికి తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానాల కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల రూ.100 కోట్లు కావటం గమనార్హం.

అంతకంతకూ పెరుగుతున్న వాహనాలతో రోడ్డు రద్దీ కావటమే కాదు.. నిబంధనల్ని పాటించకుండా పోతున్న వారి సంఖ్య పెరగటమే కానీ తగ్గటం లేదంటున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల్లో మొదటి స్థానం మితిమీరిన వేగంతో వాహనాల్ని దౌడు తీయించటంగా చెప్పక తప్పదు. పదకొండు నెలల కాలంలో ఓవర్ స్పీడ్ మీదనే ఏకంగా 29.98లక్షల కేసులు నమోదు కాగా.. ఈ కేసుల కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.82.8 కోట్లు కావటం విశేషం.

తెలంగాణ వ్యాప్తంగా రోడ్ల మీద జరుగుతున్న ప్రమాదాలు.. దాని కారణంగా మరణిస్తున్న వారి లెక్కల్ని చూస్తే.. రోజూ 58 రోడ్లు ప్రమాదాలు జరుగుతుండగా 16 మంది ప్రయాణిస్తున్నారు. 60 మంది గాయాలకు గురి అవుతున్నారు. ప్రతి నిమిషానికీ ఆరు ఓవర్ స్పీడ్ కేసులు నమోదు కావటం చూస్తే.. ట్రాఫిక్ నిబందనల్ని ఎంతలా ఉల్లంఘిస్తున్నారో ఇట్టే అర్థం కాక మానదు.

ఇక.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్ని చూస్తే.. నేషనల్ హైవేలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండటం విశేషం. గడిచిన పదకొండు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు 19,538 అయితే మరణించిన వారు 5,539 మంది కావటం విషాదం. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి విషయంలో ప్రభుత్వం మరింత కరకుగా వ్యవహరించాల్సిన అవసరం తాజాగా విడుదలైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.