Begin typing your search above and press return to search.

ఏపీ కోసం తెలంగాణలో ఆందోళనలు

By:  Tupaki Desk   |   27 Jan 2017 10:29 AM GMT
ఏపీ కోసం తెలంగాణలో ఆందోళనలు
X
పడుతూ లేస్తూ ఉన్న ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమం కొత్త రూపు దాల్చాల్సిన అవసరం కనిపిస్తోంది. తాజాగా ఏపీ హోదా కోసం తెలంగాణలోనూ నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కుమార్తె - నిజామాబాద్ ఎంపీ కవిత.. తెలంగాణకు చెందిన ప్రముఖ హీరో సంపూర్ణేశ్ బాబు వంటి వారు ఏపీ ప్రత్యేక హోదాకు బాహాటంగా మద్దతు పలకగా తాజాగా ప్రజలు కూడా మద్దతు పలుకుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పోరాటాల పురిటిగడ్డ కరీంనగర్ జిల్లాకు చెందిన యువత ఈ రోజు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరసనలు తెలపడం గొప్ప విషయం.

కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి - హోదా ఇవ్వాల్సిందేనని నినాదాలు చేశారు. వైసీపీ నేతలు కొందరు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. హోదా కోసం నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉందని, దాన్ని గమనించి, నిరసనలను తొక్కివేయాలన్న ఉద్దేశాన్ని విడనాడాలని వారంతా కోరారు.

తెలంగాణకు చెందిన ప్రజలు ఉద్యమించి సొంత రాష్ట్రం ఎలా సాధించుకున్నారో అందరికీ తెలిసిందే. వారిప్పుడు ఏపీ హోదా కోసం గళమెత్తుతున్నారు. నిన్న విశాఖ కేంద్రంగా ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమం మొదలవ్వాల్సి ఉన్నా కూడా ప్రభుత్వం అణచివేయడంతో ఆగిపోయింది. ఈ దశలో మిగతా రాష్ట్రాల నుంచి కూడా మద్దతు దొరుకుతుండడంతో ఏపీలో ఉద్యమం వేగవంతం కావాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజానికి.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయని కేంద్రం చెబుతోంది. కానీ.. ఉమ్మడి ఏపీ నుంచి విడివడిన తెలంగాణ ప్రజలే స్వయంగా ఏపీ కోసం ఉద్యమిస్తున్నప్పుడు ఇంక అడ్డేముందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/