Begin typing your search above and press return to search.

శార‌దా పీఠంలో టీ పోలీసుల‌దే హ‌వా!

By:  Tupaki Desk   |   24 Dec 2018 6:07 AM GMT
శార‌దా పీఠంలో టీ పోలీసుల‌దే హ‌వా!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజా విశాఖ ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకున్నాయి. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి శార‌దా పీఠానికి నేరుగా వెళ్లిన కేసీఆర్.. స్వాములోరి ఆశ్ర‌మంలో రెండు గంట‌ల‌కు పైనే గ‌డ‌ప‌టం తెలిసిందే.ఈ సంద‌ర్భంగా ఆశ్ర‌మం చుట్టూ హ‌డావుడి భారీగా నెల‌కొంద‌న్న‌ది టీవీల్లో చూసిన విజువుల్స్ ను చూస్తే అర్థ‌మైపోతుంది.

అయితే.. ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో ఆస‌క్తిక‌ర అంశం.. మీడియాలో పెద్ద‌గా ఫోక‌స్ కాని అంశం ఒక‌టి ఉంది. శార‌దా పీఠం వ‌ద్ద తెలంగాణ పోలీసు బ‌ల‌గాలు బందోబ‌స్తు నిర్వ‌హించ‌టం విశేషం. పోలీసులు మాత్ర‌మే కాదు.. ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ కూడా విశాఖ‌కు వ‌చ్చి.. ప‌ర్య‌వేక్ష‌ణ జ‌రిపింది. ఆశ్ర‌మంలో కేసీఆర్ ఉన్నంత సేపు.. లోప‌ల‌కు ఎవ‌రు వెళ్లాల‌న్న విష‌యాల్ని తెలంగాణ పోలీసులే చూసుకోవ‌టం క‌నిపించింది.

కేసీఆర్‌ను ఎవ‌రెవ‌రు క‌ల‌వాల‌న్న‌ది తెలంగాణ పోలీసులే డిసైడ్ చేశారు. వారు అనుమ‌తి ఇచ్చిన త‌ర్వాత మాత్ర‌మే ఏపీ పోలీసులు వారిని లోప‌ల‌కు పంప‌టం క‌నిపించింది. కేసీఆర్‌ను ప‌లువురు వ్యాపార‌వేత్త‌లు.. విశాఖకు చెందిన మ‌రికొంద‌రు క‌లిశారు. పైపైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు ఏపీ పోలీసులు చూసినా.. కీల‌క‌మైన చోట్ల మాత్రం తెలంగాణ పోలీసుల హ‌డావుడే ఎక్కువ‌గా క‌నిపించింది. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌రో రాష్ట్రానికి వ‌చ్చిన‌ప్పుడు.. స‌ద‌రు రాష్ట్రానికి చెందిన పోలీసుల హ‌డావుడి ప‌రిమితంగా ఉంటుంది. ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి శార‌దా పీఠం ద‌గ్గ‌ర క‌నిపించింద‌న్న మాట ఏపీ పోలీసు అధికారులు కొంద‌రు ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో మాట్లాడ‌టం గ‌మ‌నార్హం.