Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ఉల్లంఘన: రోడ్డెక్కిన వారికి భారీ షాక్

By:  Tupaki Desk   |   24 March 2020 10:30 AM GMT
లాక్ డౌన్ ఉల్లంఘన: రోడ్డెక్కిన వారికి భారీ షాక్
X
సాధారణంగా సెలవులిస్తే ఏం చేస్తారు.. పిల్లా పాపలతో కలిసి ఎంజాయ్ చేయడానికి విహార యాత్రలకు వెళతారు. కానీ ఇప్పుడూ సెలవులిచ్చారు. మొత్తం లాక్ డౌన్ చేశారు. కానీ ఇప్పుడిచ్చిన సెలువులు ఎంజాయ్ చేయడానికి కాదు.. కరోనాను నియంత్రించడానికి.. జనం ఇంటి నుంచి కాలు బయట పెట్టవద్దని ప్రభుత్వాలు హుకూం జారీ చేశాయి. అంటు వ్యాధి వ్యాపించకుండా ప్రజలను దిగ్బంధించడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేకుండా పోయింది.

ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణభయంతో బతుకుజీవుడా అంటూ ఇంట్లోనే ఉండాలి. కానీ ప్రభుత్వం ఆదేశించినా.. పరిస్థితి చెప్పినా కూడా కొంతమంది కనీసం ఇంగితజ్ఞానం లేకుండా సోమవారం రోడ్డెక్కారు. లాక్ డౌన్ అని ప్రకటించినా కూడా ఉల్లంఘించి తమ వాహనాలతో బయటకు వచ్చారు. పరిస్థితి తీవ్రతను పక్కనపెట్టి వచ్చిన వీరందరికీ పోలీసులు షాక్ ఇచ్చారు.

కరోనా కట్టడికి సర్వం బంద్ చేసినా కొందరు రోజువారీ పనుల కోసం.. మరికొందరు ఇంకొన్ని సిల్లీ కారణాలతో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కారు.

తాజాగా హైదరాబాద్ లో వాహనాలతో బయటకు వచ్చిన వారికి పోలీసులు షాకిచ్చారు. ఒకే రోజులో 2400 వాహనాలను సీజ్ చేశారు. లాక్ డౌన్ సమయంలో ఒక వ్యక్తి వాహనంలో ఒక్కరే ప్రయాణించాలి. అది కూడా అత్యవసరమైన కూరగాయలు, మందులు, నిత్యవసరాలకే బయటకు రావాలి. అది కూడా సమీప ఏరియాలోనే.. కానీ ఉల్లంఘించిన వాహనదారులు ఇద్దరు, నలుగురు వాహనాల్లో ప్రయాణించారు. దీంతో పోలీసులు కొరఢా ఝలిపించారు. మొత్తం 2400 వాహనాలు సీజ్ చేయగా.. అందులో 1058 ద్విచక్ర వాహనాలు - 948 త్రీవీలర్లు - 429 ఫోర్ వీలర్స్ - మరో 45 భారీ వాహనాలు ఉన్నాయి..

సీఎం కేసీఆర్ - పోలీసులు ప్రజలను ఇళ్ల వద్దే ఉండాలని కోరినా వినిపించుకోకుండా బయటకు వచ్చిన వారికి పోలీసులు షాకిచ్చారు. హైదరాబాదే కాదు... తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్య తీసుకొని లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు.